Hair loss: అకస్మాత్తుగా జుట్టు రాలడానికి గల కారణాలేంటో తెలుసా?
యువతలో చాలామందికి 20 ఏళ్ల వయసు నుంచే జుట్టు రాలడం అధికమైంది. కొంతమంది టీనేజర్లు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. తలస్నానం చేసినప్పుడో, తల దువ్వుకుని దువ్వెన వైపు చూసినప్పుడో మనసు చివుక్కుమంటుంది. అకస్మాత్తుగా ఇలా జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
జుట్టు రాలడం అనేది ప్రస్తుతం యూనివర్సల్ సమస్యగా మారింది. ఒకప్పుడు పండు ముసలివారికి కూడా తలంతా బిగుతైన వెంట్రుకలు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. యువతలో చాలామందికి 20 ఏళ్ల వయస్సు నుంచే జుట్టు రాలడం అధికమైంది. కొంతమంది టీనేజర్లు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. తలస్నానం చేసినప్పుడో, తల దువ్వుకుని దువ్వెన వైపు చూసినప్పుడో మనసు చివుక్కుమంటుంది. అకస్మాత్తుగా ఇలా జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది జుట్టు రాలడం గురించి ఆలోచిస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, మరికొంతమంది దేనిపైనా ఫోకస్ పెట్టలేకపోతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా జుట్టు రాలడానికి కారణం వృద్ధాప్యంతో వచ్చే ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే పిలిచే వంశపారంపర్య సమస్య. ఇది కాకుండా వెంట్రకలు పలచబడటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. మితిమీరిన హెయిర్ కేర్ విధానాలు, నెత్తిపై ఇన్పెక్షన్, కొన్ని మందులు లేదా హార్మోన్ల మార్పు, జుట్టు రసాయన చికిత్సలు ఎక్కువగా చేయడం లాంటి కారణాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వెంట్రుకలు ఊడిపోవడం వల్ల ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అతిగా ఆలోచిస్తున్నారో వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఆందోళనలు, ఒత్తిళ్లను నివారించి అసలు జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకోవాలి.
సరైన ఆహారం తీసుకోకపోవడం..
మీరు బరువు తగ్గడానికి కఠిన ఆహార నిబంధనలు అవలంబిస్తున్నట్లయితే ఆ ప్రభావం మీ జుట్టు మీద కూడా పడుతుంది. వెంట్రుకలకు తగిన పోషకాలు అందక అవి త్వరగా ఊడిపోయే అవకాశముంటుంది. ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ లాంటి పోషకాలు లోపించడం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుందని ప్రముఖ కాస్మోటాలజిస్ట్ శిల్పి బేల్ అన్నారు. కొన్ని డైట్ ల వల్ల అవసరమైన ప్రాథమిక పోషకాలు కోల్పోతారని ఆమె స్పష్టం చేశారు. ఏ, బీ12, డీ లాంటి విటమిన్లతో పాటు జింక్, ఐరన్, ప్రోటీన్ లాంటి పోషకాల లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీన పడతాయని, ఫలితంగా జుట్టు రాలిపోతుందని ఎస్తెటిక్ క్లినిక్స్ వైద్యులు డాక్టర్ రింకీ కపూర్ చెప్పారు.
నెత్తిపై ఇన్ఫెక్షన్..
బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా శిలీంధ్రాలు హెయిర్ ఫోలికల్స్ పై దాడి చేసినప్పుడు నెత్తిపై ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి సమయంలో మీరు చీము గడ్డలు, ఎర్రగా మారడం, పొలుసులు రావడం లాంటివి గమనించవచ్చు. చాలావరకు ఇన్ఫెక్షన్లు సరైన యాంటీ బయాటిక్ లేదా యాంటి ఫంగల్ మందులతో నయం అవుతాయని వైద్యులు అంటున్నారు.
జుట్టుపై అతి రక్షణ..
జుట్టును స్టైలిష్ గా ఉంచడాన్ని మనలో చాలా మంది ఇష్టపడతారు. ఈ ఇష్టం మితిమీరితే జుట్టు రాలిపోయే అవకాశముంటుంది. ఎందుకంటే మీరు వాడే కెమికల్స్, హెయిర్ ప్రొడక్టులు, ఇతర హెయిర్ ట్రీట్మెంట్స్ జుట్టు రాలడానికి దారితీయవచ్చు. అంతేకాకుండా వెంట్రుకలపై అధిక వేడితో కూడిన స్టైలింగ్, రసాయన చికిత్సలు ట్రాక్షన్ అలోపేసియా అని పిలిచే సమస్యకు కారణమవుతాయి. దీని వల్ల జుట్టు అధికంగా రాలుతుంది.
హార్మోన్ల అసమతుల్యత..
PCOS, మెనోపాజ్, ఉబకాయం, గుండె సమస్యలు లాంటి అనేక అంశాలు జుట్టు రాలడానికి కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
మెడికేషన్..
బ్లడ్ థినర్స్, యాంటిడిప్రెసెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని రకాల మందులను వాడటం వల్ల వెంట్రుకలు ఊడిపోయే అవకాశముంది.
సంబంధిత కథనం