Chanakya Niti On Couples : భార్యాభర్తల మధ్య ఈ విషయాలు వస్తే కుటుంబం ఛిన్నాభిన్నం!
Chanakya Tips Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి కుటుంబం గురించి గొప్ప విషయాలు చెప్పాడు. కొన్ని ఆలోచనలు భార్యాభర్తల మధ్య వస్తే కుటుంబ జీవితం నాశనమవుతుందని పేర్కొన్నాడు.
దాంపత్య జీవితంలో మనం ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటాం. కుటుంబంలో సుఖం, దుఃఖం, బాధలు ఉంటాయి. అవి లేకుండా బంధం ఉండదు. గొడవ పడితేనే బంధానికి అందం. అయితే కొన్ని రకాల ఆలోచనలు మాత్రం భార్యభర్తల మధ్య రాకూడదు. వస్తే కుటుంబ జీవితం నాశనం అవుతుంది. మళ్లీ దగ్గర అయ్యేందుకు ప్రయత్నించినా కుదరకపోవచ్చు.
చాణక్య నీతిలో చెప్పిన ప్రకారం కుటుంబం బాగుండాలంటే నాలుగు సమస్యలు ఉండకూడదు. ఆ నాలుగు విషయాలు మీ కుటుంబంలోకి వస్తే, సంతోషంగా ఉండటం కచ్చితంగా సాధ్యం కాదు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏంటో చూద్దాం..
అనుమానం పెద్ద రోగం
చాణక్యుడి ప్రకారం సందేహం అనే పురుగు కుటుంబంలోకి ప్రవేశించకూడదు. భర్తను భార్య లేదా భార్యను భర్త అనుమానించవద్దు. అనుమానం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీ భాగస్వామిపై సందేహాలుంటే మాట్లాడి పరిష్కరించుకోండి. లేకపోతే ఆ సందేహం మీ కుటుంబాన్ని కాల్చేస్తుంది. భార్యాభర్తలు తెలివితో వ్యవహరించాలి. కుటుంబాన్ని అనుమానం అనే భూతం నాశనం చేస్తుంది. అనుమానం అనేది రోగం కంటే పెద్దది.. పెరుగుతూ ఉంటుంది.. కానీ తగ్గదు.
అహం అస్సలు ఉండకూడదు
చాణక్యనీతి ప్రకారం, కుటుంబాన్ని నాశనం చేసే రెండో అంశం అహం. కుటుంబంలో ఆడ, మగ ఇద్దరికీ అహం ఉండకూడదు. మనిషి అహం తలలో ఉంటే ప్రపంచం కనిపించదు. తమ భాగస్వామితో కూడా అహంతోనే ఉంటారు. నేను అనే అహంకారం ఉంటే సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించడం సాధ్యం కాదు. మనం అని అనుకుంటూ ఉండాలి. సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించాలనుకునే వారు అహంకారాన్ని వదిలిపెట్టాలి.
అబద్ధాలతో జీవితం నాశనం
అబద్ధం వినడానికి మధురంగా ఉంటుంది.. నిజం వినడానికి చేదుగా ఉంటుంది. కానీ అబద్ధాలు చెబితే.. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. చాణక్యుడి ప్రకారం మీ జీవిత భాగస్వామికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. అబద్ధాలతో నిర్మించిన కుటుంబం శాశ్వతంగా ఉండదు. కుటుంబం అనే సముద్రంలో అబద్ధాలకు చోటు ఇవ్వకండి. భార్యాభర్తలది పవిత్రమైన సంబంధం. సమస్య ఏదైనా, మీ భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోండి. ఒక్కసారి అబద్ధం చెబితే ప్రతిసారీ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి నిరంతరం అబద్ధాలు చెప్పాలి. అప్పుడు కుటుంబ జీవితం నాశనం అవుతుంది.
ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి
కుటుంబంలో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఆడపిల్ల అనే కారణంతో చిన్నచూపు చూడకూడదు. సమాన అవకాశం కల్పించాలి. ఇంట్లో భార్యను గౌరవంగా చూసుకోవాలి. మీ భర్త ఇప్పటికీ పని చేయనందున లేదా అతని జీతం తక్కువగా ఉన్నందున అతడికి గౌరవం తగ్గించకూడదు. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. గౌరవం అతడి పని ద్వారా నిర్ణయించబడకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించినప్పుడే సంతోషకరమైన దాంపత్యం సాధ్యమవుతుంది.
పెళ్లి అనేది ఒక అందమైన అనుబంధం. ఏడు అడుగులు వేస్తే ఏడు జన్మలలో కలిసి ఉంటారని నమ్మకం. ఏడేడు జన్మలు కలిసి జీవిస్తారో లేదో తెలియదు కానీ ఉన్న ఒక్క జన్మను అర్థవంతంగా జీవించాలి. అప్పుడే వివాహ బంధానికి విలువ ఇచ్చినట్టు.