Superfoods- Immunity| భారతీయ వంటగదే ఔషధశాల.. ఈ మూడు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది!
సీజనల్ ఇన్ఫెక్షన్ల నివారణ కోసం ఫార్మసీ మందులు అవసరం లేదు. భారతీయ వంటగదే ఒక ఔషధ శాల అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. వారు సూచించిన మూడు రకాల పదార్థాలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు నయమవటమే కాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుందట. అవేంటో చూడండి..
ఇటీవల కాలంగా మనం గమనిస్తే ఎక్కడో ఒకచోట ఒక కొత్త వైరస్ పుట్టుకొస్తుంది. ప్రజలు వరుసగా ఇన్ఫెక్షన్ల బారినపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అనేక రకాల వైరస్‌లు, బాక్టీరియాలు ఎక్కువగా ప్రబలుతాయి. వీటి తాకిడిని తట్టుకోవాలంటే మన శరీరం దృఢంగా ఉండాలి. అంతర్గతంగా మన రోగనిరోధక శక్తి బలోపేతంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి సీజనల్ ముప్పులనైనా తప్పించుకోగలం. ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారే ముందుగా ఇన్ఫెక్షన్ల బారినపడతారు.
అయితే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ సోకినా, కొద్దిగా అస్వస్థతకు గురైనా వెంటనే స్థానిక ఫార్మసీ స్టోర్లకు వెళ్లి అందుకు తగినట్లుగా సప్లిమెంట్లను తీసుకునే బదులు సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. భారతీయ వంట గదుల్లోనే అనేక రకాల వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఔషధాలు ఉన్నాయి. అనేక రకాల హోం రెమెడీస్ ఉన్నాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీటూమోరిజెనిక్, యాంటీకార్సినోజెనిక్, యాంటీఆక్సిడెంట్ల గుణాలు కలిగిన పదార్థాలకు భారతీయ వంటగదులు స్టోర్‌హౌస్‌గా ఉంటాయి. మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయగలవు, గుండె జబ్బులను నివారించగలవు, మానసిక స్థితిని మెరుగుపరచగలవు.
ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్సర్ ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే మూడు సహజ ఔషధాల గురించి వివరించారు. ఈ మూడు పదార్థాలు జీర్ణ సమస్యలను తీర్చి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని డాక్టర్ దీక్ష తెలిపారు. అవేంటో మీరూ తెలుసుకోండి మరి.
1. అల్లం:
పొడి అల్లం (శొంఠి)ని విశ్వభేషజా (యూనివర్సల్ మెడిసిన్) అంటారు. ఉబ్బరం, కీళ్ల నొప్పులు, ఋతు తిమ్మిరి, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి సమస్యలన్నింటి నివారణకు అల్లమే ఔషధం.
ఎలా ఉపయోగించాలి: అల్లంను ఉడికించి చాయ్ చేసుకొని తాగాలి లేదా పాలలోనూ కలుపుకోవచ్చు. 1 tsp అల్లం పొడిని 1 tsp పసుపు, తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు ఇతర శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
2. దేశీ ఆవు నెయ్యి:
శారీరక సమస్యలకైనా లేదా మానసిక రుగ్మతలకైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. చర్మంపైన గాయాలకు, కాలిన గాయాలకు, వెంట్రుకల ఆరోగ్యానికి ఆవు నెయ్యి సేవించవచ్చు. నాసికా చుక్కల ద్వారా తీసుకుంటే నిద్ర కలుగుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆవు నెయ్యిని ఆహారంలోనైనా నాసిక ద్వారా తీసుకోవాలి. ఇది సహజమైన శీతలీకరణిగా ఉంటుంది. వాత, పిత్త సమస్యలను తీర్చుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మీ కణజాలాలకు పోషణ ఇస్తుంది, కండరాలను బలపరుస్తుంది, వాక్కును పెంచుతుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. చర్మం నిగారింపు కోసం, సంతానోత్పత్తి, రోగనిరోధక శక్తి మొదలగు ప్రయోజనాలకు ఉత్తమమైనది.
3. పుదీనా :
ఇది అన్ని కాలాలకు ఉత్తమమైనది. జలుబు, దగ్గు, ఏసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, డిటాక్స్, మొటిమలు, సైనసైటిస్, మలబద్ధకం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కోసం పుదీనా ఉపయోగించవచ్చు.
7 నుంచి 10 పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో 5 నిమిషాలు ఉడకబెట్టి, వడకట్టండి. దీని ఉదయాన్నే తీసుకోండి. ఇది పైన పేర్కొన్న అన్ని బాధలను శాంతింపజేస్తుంది.
మూడ్ బాగాలేకపోయినా, కడుపునొప్పి ఉన్నప్పుడు లేదా సాధారణ జలుబు సమస్యలతో బాధపడుతున్నప్పుడు పుదీనా తాగితే మార్పు కనిపిస్తుంది.
ఇలాంటివి ఇంట్లోనే అనేక ఔషధాలు ఉన్నప్పుడు ఫార్మసీ మందులు ఎందుకు? అయితే మీకు దేనిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలు. ఇందుకోసం ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే వారు మీకు తెలియజేస్తారు.
సంబంధిత కథనం