Vijay Sethupathi: ఆ స్టార్ హీరోలతో కలిసి ఇక సినిమాలు చేయను: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్-vijay sethupathi says he will not work with stars in hindustan times interview ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: ఆ స్టార్ హీరోలతో కలిసి ఇక సినిమాలు చేయను: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

Vijay Sethupathi: ఆ స్టార్ హీరోలతో కలిసి ఇక సినిమాలు చేయను: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jun 06, 2024 02:05 PM IST

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తానిక స్టార్ హీరోలతో కలిసి పని చేయనని, విలన్ పాత్ర కూడా పోషించనని చెప్పడం విశేషం.

ఆ స్టార్ హీరోలతో కలిసి ఇక సినిమాలు చేయను: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
ఆ స్టార్ హీరోలతో కలిసి ఇక సినిమాలు చేయను: విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

Vijay Sethupathi: విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లలోనూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు. మహరాజా అంటూ తన కెరీర్లో 50వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఇక మీద స్టార్లతో కలిసి పని చేయనని, విలన్ పాత్రలకు దూరంగా ఉంటానని చెప్పడం విశేషం.

వాళ్లతో చేదు అనుభవం

తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్లతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారా అని విజయ్ సేతుపతిని హిందుస్థాన్ టైమ్స్ అడిగింది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. "లేదు. అలాంటి సినిమాలతో విసిగిపోయాను ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి వాటితో నాకు కొన్ని మంచి, కొన్ని చెడు అనుభవాలు ఉన్నాయి.

మరో స్టార్ తో కలిసి సినిమా అంగీకరించినప్పుడు మీకు ఎలాంటి రోల్ లభించబోతోందో ముందే తెలుస్తుంది. కానీ ఆ పాత్రలో మనం ఎంత బాగా నటించినా.. చివరికి ఆశించిన పేరు మాత్రం మనకు రాదు. ఆ స్టార్ లాగే మనం కూడా ఆ సినిమా కోసం సమానంగా కష్టపడినా.. దానిని ఎవరూ గుర్తించరు" అని విజయ్ అనడం గమనార్హం.

విలన్ పాత్రలకు నో

ఇక తాను విలన్ పాత్రలు కూడా పోషించబోనని విజయ్ స్పష్టం చేశాడు. "అవును. మెర్రీ క్రిస్మస్ సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఈ విషయం చెప్పాను. ఇక మీద విలన్ పాత్రలు, అతిథి పాత్రలు పోషించనని స్పష్టం చేశాను. ఈ మధ్య కాలంలో అలాంటి ఎన్నో పాత్రలను నిరాకరించాను. ఒకే పాత్రను పదే పదే పోషించడం వల్ల కొన్ని హద్దులు, పోలికలు వస్తాయి" అని విజయ్ అన్నాడు.

లవ్ స్టోరీ చేస్తాను

విజయ్ సేతుపతి సినిమాలు భిన్నంగా ఉంటాయి. ఈ పాత్రల ద్వారానే అతడు విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అలాంటి నటుడు గతంలో 96 అనే లవ్ స్టోరీ సూపర్ హిట్ అందుకున్నాడు. మరి మళ్లీ అలాంటి పాత్రలు చేస్తారా అని ప్రశ్నించగా.. తనకు కూడా లవ్ స్టోరీలంటే ఇష్టమే అని అనడం విశేషం.

"రొమాంటిక్ సినిమాలు చేయడం అంటే నాకు ఇష్టం. నేను ఓ మంచి లవ్ స్టోరీ కూడా వెతుకుతున్నాను. ఇప్పటి వరకూ అలాంటి స్టోరీ దొరకలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను" అని విజయ్ సేతుపతి అన్నాడు.

కెరీర్లో 50వ సినిమాపై..

మహరాజా అంటూ తన కెరీర్లో మైల్ స్టోన్ 50వ సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంత వరకూ తన కెరీర్ ఎలా సాగిందన్నదానిపైనా అతడు స్పందించాడు. తన కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోందని అతడు చెప్పడం విశేషం. సినిమాలో స్క్రిప్ట్ నుంచి ప్రమోషన్ల వరకు ప్రతి విషయం చాలా ముఖ్యమైనదే అని విజయ్ అన్నాడు.

ఇక తన కెరీర్లో దర్శకత్వం వైపు కూడా చూస్తున్నట్లు అతడు చెప్పాడు. "కొంతకాలంగా ఆ ఆలోచన ఉంది. ప్రస్తుతం నేను లైటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ లాంటి వాటి వైపు ఎక్కువగ దృష్టి సారిస్తున్నాను. త్వరలోనే అది కూడా సాకారమవుతుందని ఆశిస్తున్నాను" అని విజయ్ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024