Vemulawada Rajanna Kodelu : పేరుకే గోశాల.. వేములవాడ రాజన్న కోడెలను తరలించేది కబేళాలకు!
Vemulawada Rajanna Kodelu : వేములవాడ రాజన్న కోడెలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజన్న కోడెలను కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆగస్టు 12న 60 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించారు. మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసుతో తెచ్చిన 60 కోడెల్లో ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటి గురించి ఆరాతీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు గోశాల నిర్వాహకుడు వీటి రాజన్న కోడెల గురించి పొంతన లేని సమాధానాలు చెప్పడం అనుమానాలను పెంచుతోంది. గోశాల ముసుగులో గోవులను కబేళాలకు తరలిస్తున్నట్టు అతనిపై ఆరోపణలు వస్తున్నాయి.
అసలు ఏం జరిగింది..
గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబుకు వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 60 కోడెలను ఇచ్చారు. కానీ.. అతను చెప్పిన గోశాలలో ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నాయి. మిగతా గోవులను విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతేడాది ఫిబ్రవరి 1న తమ కుటుంబ సభ్యుల పేరుతో రాజేశ్వర సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది.
గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెలో డీబీఏం-38 సబ్ కెనాల్ పక్కన నాలుగు నెలల కిందట చిన్నపాక వేశారు. అందులోనే చిన్న గోశాల ఏర్పాటు చేశారు. ా తర్వాత వేములవాడ ఆలయం నుంచి 60 కోడెలను తీసుకొచ్చారు. అందులో 49 కోడెలను అమ్ముకున్నారని.. విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామంలో.. మంద స్వామి, రాంబాబు కలిసి ఐదేళ్ల కిందట హనుమాన్ గోశాలను నిర్వహించారు. పలు ఆలయాల నుంచి గోవులను తీసుకొచ్చి సంరక్షణ పేరిట వీరు కబేళాలకు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కబేళాలకు అమ్ముతుండగా తాము అడ్డుకుని పోలీసులకు పట్టిచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో.. హనుమాన్ గోశాలను మూసివేశారు. మళ్లీ కొత్తగా గట్టుకిందిపల్లెలో గోశాల ఏర్పాటు చేసి.. దీని ద్వారా దందా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. తాను వేములవాడ నుంచి 60 కోడెలను తీసుకొచ్చింది వాస్తవమేనని గోశాల నిర్వాహకుడు రాంబాబు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం తన వద్ద 11 ఉన్నాయని అంటున్నారు. తాను తీసుకొచ్చిన వాటిల్లో 26 కోడెలను తిరిగి వేములవాడలోని గోశాలలో అప్పగించానని చెబుతున్నారు. మిగతా వాటిల్లో కొన్ని చనిపోగా.. మరికొన్ని తీసుకొస్తుండగానే పారిపోయినట్లు వింత సమాధానాలు చెప్పారు.
పోలీసుల విచారణ..
ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో.. పోలీసులు దృష్టి సారించారు. 49 కోడెలను అమ్మేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నామని, రాంబాబు ఒక్కరికే 60 కోడెలను ఎలా ఇచ్చారనే విషయమై వేములవాడ ఈవోకు లెటర్ రాశామని పోలీసులు చెబుతున్నారు. ఈవో నుంచి రిప్లై వచ్చాక.. దాన్నిబట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. ఈ వ్యవహారంలో మంత్రి సురేఖ సిఫారసు లెటర్ కీలకంగా మారింది. మంత్రి రాంబాబుకు లెటర్ ఎందుకు ఇచ్చారనే చర్చ జరుగుతోంది.