East Godavari Attack: నల్లజర్లలో అమ్మాయిని అపహరించే ప్రయత్నం, అడ్డుకున్న తల్లిపై కత్తితో దాడి...
East Godavari Attack: తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది అరాచకం సృష్టించాడు. ప్రేమ పేరుతో వేధిస్తూ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాన్ని అడ్డుకున్న అ అమ్మాయి తల్లిపై కత్తితో దాడికి ఒడిగట్టాడు. దీంతో ఆమె స్పృహతప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
East Godavari Attack: కుమార్తెను అపహరించే చేస్తున్న యువకుడిని అడ్డుకున్న తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. బాధితురాలిని తాడేపల్లి గూడెం ఆసుప్రతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడి ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నల్లజర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గుదే అప్పారావు, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె (17) ఉంది. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ రాసింది. ఆ తరువాత ఇంటి వద్దనే ఉంటుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ గుర్రం రాజు అదే కాలనీలో నివాసం ఉంటున్న అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని గత కొంత కాలంగా రాజు వేధింపులకు దిగుతున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెంట పడుతున్నాడు. అందుకు ఆ అమ్మాయి నిరాకరించింది. అంతేకాకుండా తల్లి శిరీషకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అప్పారావు, శిరీషలు రంగంలోకి దిగి ఇటీవలి పెద్దల సమక్షంలో రాజు కుటుంబ సభ్యుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. రాజును మందలించారు. తమ కుమార్తె జోలికి రావద్దని రాజుకు చెప్పాలని, వేధింపులకు దిగితే కుదరదని వారికి తెలిపారు. దీనికి అందరూ సమ్మతించారు.
అయితే రాజు ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. మూడు రోజులు నుంచి వేధింపులను పెంచాడు. ఆదివారం మధ్యాహ్నం శిరీష తన కుమార్తెను తీసుకుని చర్చికి వెళ్లింది. అక్కడ ప్రార్థనలు ముగిసిన తరువాత తిరిగి కుమార్తెతో పాటు ఇంటికి బయలు దేరింది. మార్గమధ్యలో కమ్యూనిటీ హాలుకు సమీపంలో శిరీష కుమార్తెను రాజు లాక్కేళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో శిరీష రాజును అడ్డుకుంది. అంతేకాకుండ రాజును ప్రశ్నించింది.
ఎంత చెప్పినా నువ్వు మారవా? పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చించింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో శిరీష ఫోన్‌ను రాజు నేలకేసి పగలగొట్టాడు. అనంతరం రాజు తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి, శిరీషపై దాడి చేశాడు.
రాజు కత్తితో చేసిన దాడిలో శిరీషకు తల, నుదిటిపైన తీవ్ర గాయాలు అయ్యారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె స్పృహతప్పి అక్కడికికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. శిరీష కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే శిరీషను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను అక్కడి నుంచి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం శిరీష కుమార్తెను వేధించిడం, శిరీషపై హత్యాయత్నం, అలాగే ఆమె ఫోన్ పగలగొట్టడంపై కేసు నమోదు చేసినట్లు నల్లజర్ల ఏఎస్ఐ మోహన్ రావు తెలిపారు. అలాగే కేసును దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. యువతి తల్లిపై దాడి జరిగిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)