Inter Girl Murder: నంద్యాలలో ఘోరం.. ఇంటర్ విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మృతి
Inter Girl Murder: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్ధినిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Inter Girl Murder: తండ్రి మరణించడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికను ప్రేమోన్మాది బలి తీసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో అక్కడికక్కడే బాలిక ప్రాణాలు కోల్పోయింది.
నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డి నగర్‌లో ఆదివారం అర్థారాత్రి దాటిన తర్వాత ఇంటర్‌వ విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె సజీవ దహనమైంది. ఇంటర్ విద్యార్ధిని లహరి కొంతకాలంగా అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది.
వెందుర్తి మండలానికి చెందిన లహరి అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉంటోంది. లహరి తండ్రి కొంత కాలం క్రితం మరణించారు. దీంతో ఆమె అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుకుంటోంది. కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వేధింపుల గురించి బాలిక ఇంట్లో వారికిి చెప్పడంతో బాలిక తాత నిందితుడిని కొద్ది రోజుల క్రితం మందలించాడు.
దీంతో పగ పెంచుకున్న నిందితుడు ఆదివారం రాత్రి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. బాలిక కేకలు వేస్తూ నిందితుడు రాఘవేంద్రను పట్టుకుంది. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన నిందితుడిని పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాఘవేంద్రకు చికిత్స అందిస్తున్నారు. చదువుకునేందుకు వచ్చి అనూహ్యంగా బాలిక ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.