Karthika Deepam Today December 9th: యుద్ధం మొదలుపెడుతున్నానన్న జ్యోత్స్న.. కార్తీక్, దీప దగ్గరయ్యేందుకు కాంచన వంట ప్లాన్
Karthika Deepam 2 Today Episode December 9: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్, దీప మధ్య చనువు పెంచేందుకు కాంచన ప్రయత్నిస్తుంది. కార్తీక్‍కు నచ్చిన వంట చేస్తుంది దీప. తాను యుద్ధం మొదలుపెడుతున్నానని జ్యోత్స్న అంటుంది. ఓ ప్లాన్ వేస్తుంది. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శివన్నారాయణ కోపంగా కార్తీక్‍ను బెదిరించి వెళ్లిపోయిన విషయంపై దీప మళ్లీ ఏడుస్తుంది. ఇన్ని గొడవల తర్వాత ఆయన మళ్లీ ఇంటి గుమ్మం తొక్కుతారని అనుకోలేదని, కలవడానికి ఆయన అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదని కార్తీక్‍తో దీప అంటుంది. “కానీ మీరే మరొకసారి మీ అమ్మకు పుట్టింటిని దూరం చేశారు” అని చెబుతుంది. దీంతో.. “మా తాతయ్య వచ్చింది మనవడి కోసం కాదు.. మనవరాలి కోసం” అని కార్తీక్ బదులిస్తాడు.
అలాంటి మనుషులు నాకు ఇష్టం లేదు
ఎలాగైతేనేం వెళ్లేందుకు ఒప్పుకోవచ్చు కదా అని దీప అంటుంది. నీతో కలిసి వచ్చేందుకు ఆయన కూడా అంగీకరించవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. తానంటే శివన్నారాయణకు ఇష్టం లేదు కదా అని దీప అంటుంది. “నిన్ను నా నుంచి దూరం చేసే మనుషులంటే నాకు కూడా ఇష్టం లేదు దీప” అని కార్తీక్ అంటాడు. మీరంతా ఓ కుటుంబం అని దీప అంటే.. మనిద్దరం కూడా ఓ కుటుంబమేనని, ఇదే నాకు ముఖ్యమని కార్తీక్ తెగేసి చెబుతాడు. ప్రేమతో ఇంటికి వచ్చినప్పుడు కుటుంబాలు కలుస్తాయంటాడు.
శివన్నారాయణకు శిక్షించడమే తెలుసని, క్షమించడం తెలియదని కార్తీక్ అంటాడు. క్షమించేందుకు అందరికీ నీ అంత గొప్ప మనసు ఉండదని దీపతో చెబుతాడు. “నీ గౌరవమే నా గౌరవం.. నీ మర్యాదే నా మర్యాద” అంటూ.. నువ్వు, మన కుటుంబమే ముఖ్యమని దీపకు కార్తీక్ వివరిస్తాడు. మేం దూరమైనా మీరంతా కలిసి ఉండాలని అనుకుంటున్నానని.. దీప మనసులో అనుకుంటుంది.
కాంచన ప్లాన్
తన తండ్రి శివన్నారాయణ అన్న మాటలకు కాంచన బాధపడుతూ ఉంటుంది. అక్కడి వచ్చిన అనసూయ.. ఏం వంట చేయాలని అడుగుతుంది. దీప కదా వంట చేసేదని కాంచన ఉంటుంది. దీప బాధలో ఉందని అనసూయ చెబుతుంది. ఇలాంటప్పుడే ఏదో ఒక పని చెబితేనే దీప మళ్లీ మనుషుల్లోకి వస్తుందని అంటుంది. అత్తయ్య అంటూ మధ్యలోనే దీప ఆగుతుంది. ఏంటమ్మా అని అంటుంది. మాటలు మధ్యలో ఆపకూడదని కాంచన అంటుంది.
కార్తీక్, దీప మధ్య చనువు పెంచేందుకు కాంచన కొత్త ప్లాన్ చేస్తుంది. కార్తీక్‍కు ఏం ఇష్టమో కనుక్కొని వండాలని అంటుంది. దీప ఏదో అనబోతే.. ఏం చెప్పొద్దని కార్తీక్‍ను అడిగి వండాలని కచ్చితంగా చెబుతుంది.
ఆట పట్టించి.. చెప్పిన కార్తీక్
కార్తీక్, శౌర్య.. వైకుంఠపాళి (స్నేక్స్ అండ్ లాడర్స్) గేమ్ ఆడుతుంటారు. ఇంతలో దీప అక్కడి వస్తుంది. చూసి కూడా చూడనట్టుగా కార్తీక్ ఉంటాడు. ఆటలో లీనమైనట్టు చేస్తుంటాడు. దీప పిలవాలని అనుకుంటాడు. “మీరు ఏం వండమంటారో చెప్పమంటే చేస్తాను” అని దీప అడుగుతుంది.
మీకు ఇష్టమైన కర్రీ ఏంటో కాంచనమ్మ అడగమన్నారు అని దీప చెబుతుంది. దీంతో కొత్తగా ఇదేంటని కార్తీక్ అంటాడు. నా ఇష్టాలు ఏవో అడగలేదు కదా అని అంటే.. ఇప్పుడు అడుగుతున్నాను కదా అని దీప అంటుంది. అమ్మ అడమంటే అడుగుతున్నావే కానీ.. నీ అంతటికి నువ్వు అడగడం లేదు కదా అని కార్తీక్ అంటాడు.
ఏం వండాలో నేరుగా చెప్పకుండా ఆటపటిస్తాడు కార్తీక్. క్లూస్ చెబితే కనిపెట్టాలని అంటాడు. వంకాయ గురించి నేరుగా చెప్పకుండా రకరకాల విషయాలు చెబుతాడు. దానిపై కవితలు, పాటలు రాశారని అంటాడు. చాలా హింట్స్ ఇస్తాడు. అదంతా పక్కనే ఉండి చూస్తుంటారు కాంచన, అనసూయ. చాలా రకాల కూరగాయల పేర్లు చెప్పి.. చివరికి వంకాయ అని గుర్తిస్తుంది దీప. అంతే.. తనకు ఇష్టమైన గుత్తివంకాయ కూర వండాలని కార్తీక్ చెబుతాడు. మనం అనుకున్నది జరిగిందని అనసూయతో కాంచన అంటుంది. నువ్వే గెలిచావని శౌర్య అంటే.. ఒకరి మనసు గెలిచానని కార్తీక్ అంటాడు.
భయం చావును గుర్తు చేస్తుంది
దీపే వారసురాలు దాసు చెప్పిన విషయాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. మేకప్ వేసుకుంటూనే ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పారిజాతం అక్కడికి వస్తుంది. ఎక్కడికి అని అడిగితే.. అలా అడగకు అని జ్యోత్స్న అంటుంది. మూడు రోజుల నుంచి ప్రవర్తన, మాటలో తేడా వచ్చిందని, తాత పర్మిషన్ ఇచ్చాడని ఈ గ్రానీ అవసరం లేదనుకున్నావా అని పారిజాతం అంటుంది.
ఒకరికి ఒక పని అప్పగిస్తే అది జరిగిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడేం జరిగిందని అంత క్లాస్ పీకుతున్నావంటే.. సైదులును చంపే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని ఉండి ఉంటే ప్రస్తుతం వేరేలా ఉండి ఉండేదని చెబుతుంది. ఏమైందని పారిజాతం అడిగితే.. దాసు చెప్పిన నిజాన్ని జ్యోత్స్న దాచిపెడుతుంది.
గతాన్ని ఎందుకు తలచుకుంటావని, అసలైన వారసురాలు వస్తుందని భయపడుతున్నావా అని పారిజాతం అంటుంది. నిన్నెవరో భయపెట్టారని చెబుతుంది. “జీవితంలో ఎదురుపడకూడదని అనుకున్న నిజం చాలా దగ్గరగా వచ్చి నిలబడితే చీకట్లో దెయ్యాన్ని చూసినట్టు ఉంటుంది. ఆ క్షణం భయం చావును గుర్తు చేస్తుంది” అని జ్యోత్స్న అంటుంది.
యుద్ధం స్టార్ట్ చేస్తున్నా
ఏదో జరిగింది.. ఏంటది అని అనుమానంగా పారిజాతం అడుగుతుంది. అయితే అసలు నిజాన్ని మాత్రం జ్యోత్స్న చెప్పదు. ఉనికి కోసం యుద్ధం మొదలుపెడుతున్నానని అంటుంది. “జరిగిన దాని కంటే జరగబోయేదే చాలా విలువైనది గ్రానీ. నువ్వు గతంలో చేసిన తప్పును నేను భవిష్యత్తులో సరిచేయాలని అనుకుంటున్నాను. నేను ఇది నా ఉనికిని కాపాడుకోవడానికి నేను మొదలుపెడుతున్న యుద్ధం. నన్నే చేయనీ” అని జ్యోత్స్న అంటుంది. ఏం చేయాలని అనుకుంటున్నావని పారిజాతం అడిగితే.. ఈసారి ట్రైలర్ కాదు.. సినిమానే రిలీజ్ చేస్తానని జ్యోత్స్న చెబుతుంది. వేచిచూడాలని, ప్లే సాలిడ్‍గా ఉంటుందని అంటుంది. ఏదో గట్టిగా చేయబోతోందని పారిజాతం అనుకుంటుంది.
కాశీ, స్వప్నను ఇంటికి భోజనానికి పిలుస్తాడు కార్తీక్. ఎందుకు పిలిచారని కాశీ అడుగుతాడు. ఎందుకో నువ్వే గుర్తించాలని కాశీని ఆట పట్టిస్తాడు కార్తీక్. క్లూ ఇవ్వాలని కాశీ అడుగుతాడు. కనిపెట్టలేవని చెప్పొచ్చుగా అని స్వప్న అంటుంది. ఈ క్రమంలో అందరి మధ్య మాటలు సరదాగా సాగుతాయి. కార్తీక్‍కు ఇష్టమైన కర్రీ ఏంటో కనుక్కొని మరీ దీప వండుతోందని కాంచన చెబుతుంది. అందుకే పిలిచారని అర్థమైందని కాశీ అంటాడు. మా అక్కా (దీప), నేను ఇంతే బావ స్లోగా ఉంటామని కాశీ అంటే.. కిలోమీటర్ గ్యాప్ ఉందని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ప్లాన్ షురూ
వంకాయ కూర రెడీ అని దీప అంటే అందరూ తినడానికి రెడీ అవుతారు. దీపను కూడా కూర్చోవాలని కార్తీక్ అంటాడు. తినేందుకు సిద్ధమవుతారు. ఇంతలోనే ఆఫీస్ నుంచి ప్రభాకర్‌తో కార్తీక్‍కు కాల్ చేయిస్తుంది జ్యోత్స్న. వెంటనే ఆఫీస్‍కు రావాలని జ్యోత్స్న చెబుతున్నారని కార్తీక్‍తు చెబుతాడు ప్రభాకర్. ఇంటికి గెస్టులు వచ్చారని కార్తీక్ చెబుతాడు. టైమ్ పడుతుందని అంటాడు. ఇప్పుడే రావాలని చెప్పు అనేలా జ్యోత్స్న సైగ చేస్తుంది. “మేడం మిమ్మల్ని అర్జెంట్‍గా రమ్మంటున్నారు. మీరు రావడానికి ఐదు నిమిషాలు లేట్ అయినా మేడమే మీ ఇంటికి వస్తారట” అని ప్రభాకర్ చెబుతాడు. అంత అర్జెంటా అని కార్తీక్ అంటాడు. అవును, మేడంకు ఏ సమాధానం చెప్పమంటారు అని ప్రబాకర్ అంటాడు. దీంతో కార్తీక్ తికమకలో పడతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ ముగిసింది. దీప, కార్తీక్ మధ్య దూరం పెంచేందుకు జ్యోత్స్న కొత్త ప్లాన్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. తర్వాతి ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి.
సంబంధిత కథనం