Bomb alerts : దిల్లీలో 40కిపైగా స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్- ఎవరి పని?
Delhi schools receive bomb threat : దిల్లీలోని 40కిపైగా స్కూల్స్‌కి సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకి పంపించేశారు.
దిల్లీలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. దేశ రాజధానిలోని 40కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ్ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్, డీపీఎస్ ఆర్క్పురం నుంచి ఈ బెదిరింపుల పరంపర మొదలైందని దిల్లీ పోలీసులు తెలిపారు. అనంతరం మదర్ మేరీస్ స్కూల్, బ్రిటీష్ స్కూల్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ వంటి పలు పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.
ఈ-మెయిల్ ద్వారా అన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు అందాయి.
దిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకు పంపించామని, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు సహా అగ్నిమాపక సిబ్బంది ఆయా స్కూళ్లకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు.
విద్యార్థులు స్కూల్స్‌కి బయలుదేరి, స్కూల్స్‌లో అసెంబ్లీ కోసం స్టాఫ్ ఏర్పాట్లు చేసుకుంటుండగా బాంబు బెదిరింపు అలర్ట్స్ వచ్చాయి. అధికారులు వెంటనే స్కూల్స్‌కి పరుగులు తీశారు. ప్రస్తుతానికి అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఈ పని ఎవరు చేశారు? ఎందుకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు? వంటి విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అయితే డబ్బు కోసం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు పలు మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
“స్కూల్ భవనాల్లో వివిధ చోట్ల బాంబులు పెట్టాను. అవి చాలా చిన్నవిగా ఉంటాయి. రహస్యంగా దాచి పెట్టాను. నేను ఎలాంటి హానీ కలిగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. కానీ బాంబులు పేలితే మాత్రం చాలా మందికి గాయాలవుతాయి. మీ అందరికి గాయాలవుతాయి. అలా జరగకూడదంటే నాకు 30,000 డాలర్లు (రూ. 25లక్షలు) ఇవ్వండి,” అని ఆ మెయిల్లో ఉన్నట్టు సమాచారం.
తాజా పరిణామాల మధ్య దిల్లీ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు అలర్ట్ ఇచ్చాయి.
“ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ రోజు ఉదయం పాఠశాలలో బాంబు బెదిరింపు గురించి ఒక ఇమెయిల్ వచ్చింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేస్తున్నాము. దయచేసి మీ పిల్లలను ఆయా బస్ స్టాప్ల నుంచి తీసుకోగలరు. తల్లిదండ్రులు దయచేసి వెంటనే వచ్చి తమ పిల్లలను తీసుకెళ్లాలని కోరుతున్నాము. బస్ రూట్ ఇంచార్జీలు బస్సుల కదలికలపై ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తారు," అని మదర్ మేరీస్ స్కూల్ తల్లిదండ్రులకు పంపిన సందేశంలో పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో దిల్లీ రోహణి ప్రశాంత్ విహార్లని సీఆర్పీఎఫ్ స్కూల్‌కి సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి స్కూల్ గోడ, షాపులు, వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే, వివిధ సీఆర్పీఎఫ్ స్కూల్స్‌కి బాంబు బెదిరింపు సమాచారాలు అందాయి. అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. చివరికి, అది ఫేక్ అని తేలింది!
అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్..
దిల్లీ స్కూల్స్‌కి బాంబు బెదిరింపులపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు.
“దిల్లీలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితిని ప్రజలు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అమిత్ షా వచ్చి దిల్లీ ప్రజలకు సమాధానం చెప్పాలి,” అని కేజ్రీవాల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం