Varun Tej: ఆ సినిమాకు సగం రెమ్యూనరేషనే అడిగా: వరుణ్ తేజ్
Varun Tej: ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు హీరో వరుణ్ తేజ్. ఈ సందర్భంగా తాను ఓ సినిమాకు సగం రెమ్యూనరేషనే ఇవ్వాలని నిర్మాతలను అడిగానని చెప్పారు. ఆ సినిమా ఏది.. ఆయన ఎందుకు అలా చెప్పారో వివరించారు.
Varun Tej: మెగా ప్రిన్స్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. మార్చి 1వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు, హిందీల్లో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. భారత ఎయిర్ ఫోర్స్ చేసిన ఓ భారీ వైమానిక దాడి స్ఫూర్తిగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ జోరుగా ప్రమోషన్లు చేస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్లలో వరుణ్ తేజ్ చాలా విషయాలను వెల్లడిస్తున్నారు. అంతరిక్షం సినిమాకు సగం రెమ్యూనరేషనే ఇవ్వాలని తాను నిర్మాతలను అప్పుడు అడిగానని వరుణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మిగిలిన డబ్బును సినిమా కోసం వినియోగించాలని చెప్పానని వెల్లడించారు.
వెనక్కి తగ్గను
పరాజయాలు ఎదురై కొన్నిసార్లు తన మార్కెట్ తగ్గినా కంటెంట్ ఆధారంగా ఉన్న సినిమా చేసేందుకు వెనక్కి తగ్గనని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. “నా మార్కెట్ కొన్నిసార్లు పడిపోవచ్చు. కానీ నేను కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసేందుకు వెనక్కి తగ్గను. నాకు రెమ్యూనరేషన్ సగం మాత్రమే చెల్లించాలని స్వయంగా నేనే అంతరిక్షం సినిమా నిర్మాతలను అడిగాను. మిగిలిన మొత్తాన్ని సినిమా కోసం ఖర్చు చేయాలని చెప్పా” అని వరుణ్ తేజ్ చెప్పారు.
రెమ్యూనరేషన్ లేకుండా కూడా..
ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా కంటెంట్ బేస్డ్ సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వరుణ్ తేజ్ తెలిపారు. మొత్తంగా ఫలితం ఎలా వచ్చినా కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తానని వరుణ్ స్పష్టం చేశారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాపై వరుణ్ తేజ్ చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నారు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్‍గా కనెక్ట్ అవుతుందని ఆయన మరో ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా ట్రైలర్‌ను తన బాబాయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఐదుసార్లు చూశారని, ప్రశంసించారని కూడా తెలిపారు.
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు చేసే విప్రొయాన్ మిషన్‍తో పాటు లవ్ స్టోరీ అంశాలతో అంతరిక్షం సినిమా 2018లో వచ్చింది. కమర్షియల్‍గా మోస్తరుగా సక్సెస్ అయినా.. మంచి సినిమాగా నిలిచింది. తన కెరీర్లో ఎక్కువగా కంటెంట్ ప్రధానంగా ఉండే చిత్రాలే చేశారు వరుణ్ తేజ్.
గతేడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున సినిమా వరుణ్ తేజ్‍కు తీవ్ర నిరాశ మిగిల్చింది. అంతకుముందు గని కూడా డిజాస్టర్ అయింది. గద్దలకొండ గణేశ్ తర్వాత వరుణ్‍కు సరైన హిట్ దక్కలేదు. అయితే, ఇప్పుడు వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో వరుణ్‍కు జోడీగా మానుషి చిల్లర్ నటించారు. ఇద్దరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. యుద్ధ విమానాలతో యాక్షన్, దేశభక్తి ఈ చిత్రంలో హైలైట్లుగా ఉండనున్నట్టు అర్థమవుతోంది. పాకిస్థాన్‍పై భారత్ చేసిన వైమానిక దాడుల స్ఫూర్తితో ఈ మూవీ రూపొందింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మార్చి 1న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యాయి.