Operation Valentine Trailer: గాల్లో స్టంట్స్‌తో అదరగొట్టిన వరుణ్ తేజ్.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ వచ్చేసింది
Operation Valentine Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిస్ వరల్డ్ మానుషి చిల్లార్ కలిసి నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాల్లో స్టంట్స్, దేశభక్తి డైలాగులతో వరుణ్ తేజ్ అదరగొట్టాడు.
Operation Valentine Trailer: ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దేశభక్తి కలగలిపిన మరో మూవీ ఆపరేషన్ వాలెంటైన్ వచ్చేస్తోంది. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 20) మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో వరుణ్ తేజ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ దేశభక్తి డైలాగులు హైలైట్ గా నిలుస్తున్నాయి.
ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్
వరుణ్ తేజ్, మానుషి జంటగా నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా రిలీజైన ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది.
పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కానుండగా.. మానుషి టాలీవుడ్ లోకి వస్తోంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. రుద్ర ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ మూవీలో కనిపించాడు. అతని హైట్, పర్సనాలిటీ ఈ పాత్రకు అతికినట్లు సరిపోయాయి.
పైనుంచి వచ్చే ఆర్డర్లను ఫాలో కాకుండా మొండిగా డేంజరస్ ఆపరేషన్లకు వెళ్లే పాత్ర అతనిది. నిజానికి ఆ సీన్ తోనే ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచి వరుణ్ ఒంటి నిండా గాయాలు కనిపిస్తాయి. రుహానీ శర్మకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఇందులో కనిపించింది. ఇద్దరూ కలిసి గాల్లో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత వరుణ్, మానుషి మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా ట్రైలర్ లో చూపించారు. పుల్వామాలో జరిగిన దాడి, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ పై తీర్చుకునే ప్రతీకారానికి ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరు పెట్టడం, కొన్ని దేశభక్తి డైలాగులతో ట్రైలర్ రంజుగా మారుతుంది. చివర్లో వరుణ్ నడిపే ఎయిర్ క్రాఫ్ట్ కు మంటలు అంటుకోవడం, దాని నుంచి అతడు బయటపడటానికి చేసే ప్రయత్నంతో ట్రైలర్ ముగుస్తుంది.
వరుణ్ తేజ్ వాలెంటైన్
ఇక ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్యే వరుణ్, మానుషి ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. వరుణ్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ మధ్యే వచ్చిన వాలెంటైన్స్ డేకు తాను తన భార్య లావణ్య త్రిపాఠీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని, ఆమె కూడా తనకు ఏమీ ఇవ్వలేదని చెప్పాడు.
ఇద్దరం కలిసి వాలెంటైన్స్ డే కోసం కశ్మీర్ వెకేషన్ కు వెళ్లినట్లు తెలిపాడు. మరి వరుణ్ తేజ్ ఈ ఆపరేషన్ వాలెంటైన్ తో హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది.
టాపిక్