Varalaxmi Sarathkumar Sabari Movie: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో పాన్ ఇండియా సినిమా 'శబరి'. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులుగా వ్యవహరించారు.
శబరి సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి పలు ఆసక్తకిర విశేషాలు పంచుకున్నారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల.
''సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ మూవీ. ముఖ్యంగా ఆమె నటన 'వావ్' అనేలా ఉంటుంది. తెలుగు, తమిళ వెర్షన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయింది'' అని శబరి నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు.
''శబరి మూవీ అవుట్ పుట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా మాకు అంతలా నచ్చింది. మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి అయ్యాయి. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది'' అని నిర్మాత మహేంద్రనాథ్ చెప్పుకొచ్చారు.
కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న శబరి సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రచనా సహకారం సన్నీ నాగబాబు అందించగా పాటలు రహమాన్, మిట్టపల్లి సురేందర్ రాశారు. నందు - నూర్ ఫైట్స్ చేయగా సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ కొరియోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. ఆయన ఇటీవలే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, నాంది సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ క్రాక్ మూవీతో విలన్‌గా వావ్ అనిపించుకుంది. ఇందులో జయమ్మ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం యశోద, వీర సింహారెడ్డి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తూ అట్రాక్ట్ చేసింది ఈ తమిళ ముద్దుగుమ్మ.
ఇక పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో హనుమంతుకు అక్కగా అంజమ్మగా పవర్ ఫుల్ పాత్ర పోషించింది. ఆమె యాక్టింగ్‌కు సౌత్‌తోపాటు నార్త్ ప్రేక్షకులు సైతం ప్రశంసించారు.