Varalaxmi Sarathkumar In Kerala Drugs Case: సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కోలీవుడ్‍లో హీరోయిన్‍గా అలరించింది. కానీ, అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత నటిగా, విలన్‍గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనూ క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఆమె కేరళలోని డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.
కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఆగస్ట్ 18న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, మారణ ఆయుధాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విఘ్నేష్ పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుంచి సుమారు 300 కిలోల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బులెట్స్, ఐదు 9ఎమ్ఎమ్ పిస్తోళ్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హెరాయిన్ విలువ రూ. 2100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
అయితే ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మీ శరత్ కుమార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆదిలింగం వివరాలను సేకరించేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందింగా ఎన్ఐఏ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చి ఆఫీస్‍లో వరలక్ష్మి శరత్ కుమార్‍ను అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఆదిలింగంతో పాటు ఆమెకున్న సంబంధం గురించి స్టేట్‍మెంట్ రికార్డ్ చేయనున్నారు.
ఆదిలింగం డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా వరలక్ష్మి శరత్ కుమార్‍ను ఎన్ఐఏ ప్రశ్నించనుందని సమాచారం. అయితే, ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‍కు నోటీసులు జారీ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం నటి మాత్రమే కాకుండా నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కూతురు కావడంతో హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్స్ పీఏ ఆదిలింగంతోపాటు మరో ఐదుగురు వ్యక్తులపై ఎన్ఐఏ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్, ఆయుధాలను ఇరాన్ లేదా పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు తీసుకొచ్చారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.