Rama Janmabhoomi: స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!-v samudra rama janmabhoomi movie teaser released jai siddharth about pm narendra modi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rama Janmabhoomi: స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!

Rama Janmabhoomi: స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!

Sanjiv Kumar HT Telugu
May 11, 2024 12:32 PM IST

V Samudra Rama Janmabhoomi Movie Narendra Modi: తెలుగులో స్టార్ డైరెక్టర్‌గా పేరొందిన వి సముద్ర కమ్ బ్యాక్ మూవీగా వస్తోన్న సినిమా రామ జన్మభూమి. పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయింది. హనుమంతుని రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారని హీరో తెలిపాడు.

స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!
స్టార్ డైరెక్టర్ కమ్ బ్యాక్ మూవీగా రామ జన్మభూమి.. హనుమంతుని రూపంలో మోదీ వచ్చారంటూ!

V Samudra Rama Janmabhoomi Narendra Modi: సముద్ర మూవీస్ బ్యానర్ నుంచి రామ జన్మభూమి టీజర్ రిలీజ్ అయింది. యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ రామ జన్మభూమికి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్‌ని అందించారు.

ఈ సినిమాలో జై సిద్ధార్ద్, శ్రీ రాధా, హీరో హీరోయిన్లుగా నటించగా.. నాజర్, సుమన్, అజయ్ ఘోష్, సునీల్, అనుపమ్ ఖేర్, కన్నడ కిషోర్, బాహుబలి ప్రభాకర్, దేవ్ గిల్, బీసంట్ రవి, తమిళ్ శ్రీ రామ్, దేవరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రామ జన్మభూమి టీజర్ రిలీజ్ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

"ఈరోజు దేశం మొత్తం ఎక్కడ విన్నా జై శ్రీ రామ్ నినాదమే. రామ జన్మ భూమి నిర్మాణం అయ్యాక రోజు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి రామ జన్మ భూమి టైటిల్‌తో దర్శకుడు సముద్ర గారు జై సిద్దార్ద్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సముద్రగారు ఎన్నో హిట్టు సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. కచ్చితంగా ఈ రామ జన్మభూమి కూడా పెద్ద హిట్ అవుతుంది" అని సీనియర్ హీరో మురళి మోహన్ తెలిపారు.

"ఈరోజు కర్నల్ బిక్షపతి గారు ఫోన్ చేశారు. ఒకప్పుడు కాశ్మీర్‌లో మిలిటరీ వారి ముఖాల మీద, మోకాళ్ల మీద రాళ్లు వేసే వారు. అందుకని పేస్ షీల్డ్స్ అండ్ క్నీ పాడ్స్ ఇచ్చాము. మోది గారు ఆర్టికల్ 370 ఎత్తేయ్యగానే ఆ రాళ్లు విసిరే వాళ్లే లేరు అని చెప్పారు. ఈ మార్పు అంతా కూడా మోది గారు వల్లే వచ్చింది" అని బీజీపీ ఎంపీ అభ్యర్థి, నటి మాధవి లత పేర్కొన్నారు.

"ఎంత మంది దేవుళ్లు ఉన్నా కూడా మనం రాముడినే ఎక్కువగా కొలవడానికి కారణం.. రాముడు ఈ భూమి మీద ధర్మ బద్ధంగా ఉంటూ అనేక కష్టాలు అనుభవించారు. రామ జన్మభూమి టీజర్ కొస్తే హీరో తన దేశ భక్తి చాటుకునేలా ఉంది. సినిమా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటూన్నాను" అని మాధవి లత చెప్పారు.

"ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బ్రతికారు. ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్లకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బ్రతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి. ధర్మంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాలి అనే సందేశంతో ఈ సినిమా చేస్తున్నాను" అని డైరెక్టర్ సముద్ర తెలిపారు.

"ఇండస్ట్రీకీ సింహరాశి, శివ రామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరీ, మహానంది లాంటి గొప్ప సినిమాలని అందించిన వి. సముద్ర గారి దర్శకత్వంలో నా రాముడి పేరుతో వచ్చిన రామ జన్మ భూమి సినీమాతో నేను హీరోగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది " అని హీరో జై సిద్ధార్థ్ తెలిపారు.

"రాముడు ఎప్పుడో మనకి నేర్పిన వాటిని మనం ఎప్పుడూ తప్పకుండా పాటించాలి. అలా పాటించడం మర్చిపోయినప్పుడు.. హనుమంతుడు వచ్చి సరి చేసి వెళ్తారు. అందుకే ఇప్పుడు నరేంద్రమోది గారు హనుమంతుని రూపంలో వచ్చి మన దేశాన్ని గాడిలో పెడుతున్నారు. అలాగే లోకల్‌లో చాలా మంది చిన్న చిన్న రాక్షసులు ఉంటారు వాళ్లని లైన్ ‌లో పెట్టడానికి యువత రాజకీయాలలోకి రావాలి అనేది మా కథ " అని జై సిద్ధార్థ్ అన్నారు.

IPL_Entry_Point