PM Modi : ‘మన రాముడు ఇక టెంట్​లో ఉండడు’- ప్రధాని మోదీ-pm narendra modi addresses people after the pran pratishtha ceremony at ayohya ram mandir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : ‘మన రాముడు ఇక టెంట్​లో ఉండడు’- ప్రధాని మోదీ

PM Modi : ‘మన రాముడు ఇక టెంట్​లో ఉండడు’- ప్రధాని మోదీ

Sharath Chitturi HT Telugu
Jan 22, 2024 03:00 PM IST

Ayodhya Ram Mandir live : రాముడు అంటే అగ్ని కాదని, రాముడంటే వెలుగు అని, రాముడు అంటే వివాదం కాదని, రాముడంటే సమాధానం అని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామ్​ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం జరిగిన సభలో ఈ మేరకు ప్రసంగించారు ప్రధాని.

రామ మందిరంలో ప్రధాని మోదీ..
రామ మందిరంలో ప్రధాని మోదీ.. (PTI)

Ayodhya Ram Mandir live : అయోధ్యలో రాముడు ఇక టెంట్​లో ఉండడని, దివ్యమైన మందిరంలో ఉంటాడని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 22 జనవరిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని, ఇది ఒక తేదీ మాత్రమే కాదని, ఇదొక.. కొత్త కాల చక్రాని ప్రారంభమని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, రామ్​ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

'మన రామ్​ లల్లా ఇకపై టెంట్​లో ఉండడు. మన రాముడు దివ్య మందిరంలో ఉంటాడు. ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు. రాముడి రాక వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. గర్భగుడిలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం నాకు మాటలు రావట్లేదు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు. మన ప్రార్థనల్లో ఏదో లోపం ఉండే ఉంటుంది. అందుకే.. రాముడికి గుడి ఇన్నేళ్ల పాటు సాధ్యం అవ్వలేదు. కానీ ఈరోజున.. మన లోపాలు దూరమయ్యాయని, మనల్ని రాముడి క్షమించాడని నేను భావిస్తున్నాను. ఈ రోజు ప్రతి గ్రామంలో సంకీర్తనలు జరుగుతున్నాయి. ఆలయాల్లో మహోత్సవాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం ఈరోజు దీపావళి జరుపుకుంటోంది,' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi Ayodhya Ram Mandir : "రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు. రాముడు కేవలం మన వాడే కాదు. రాముడు అందరి వాడు. రాముడు వివాదం కాదు- రాముడు సమాధానం. రాముడే నిత్యం.. రాముడే అనంతం. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠతో నేడు ప్రపంచమంతా కలిసింది. భారత్​తో పాటు అనేక దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. ఈరోజున.. రామ్​ లల్లా ప్రతిష్ఠతో పాటు వసుదైక కుటుంబం ప్రతిష్ఠ కూడా జరిగింది," అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

"రాముడి మందిర నిర్మాణం జరిగింది. మరి తర్వాత ఏంటి? కోట్లాది మంది ప్రజల నిరీక్షణకు తెరపడింది. మరి తర్వాత ఏంటి? అని అందరు అనుకుంటున్నారు. కాల చక్రం మారుతోందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందుకే నేను ఎప్పుడు చెబుతాను.. 'ఇదే సమయం.. ఇదే సరైన సమయం'. రామ మందిర నిర్మాణం నుంచి జరిగి.. భవ్య, దివ్య భారతాన్ని నిర్మించేందుకు ప్రజలు ముందుకు కదలాలి," అని మోదీ అన్నారు.

ఈ నేపథ్యంలో భారత దేశాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

'త్రేతా యుగంలోకి ప్రవేశించినట్టు ఉంది..'

"500 ఏళ్ల నాటి కల నెరవేరింది. ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు మాటలు రావట్లేదు. అయోధ్య రామ మందిరాన్ని అనుకున్న చోట నిర్మించాము. ప్రధాని మోదీ దూరదృష్టి, సంకల్పం ఇందుకు కారణం. అయోధ్య అభివృద్ధికి కోట్ల కోట్ల నిధులు అందించారు. ఈ రోజున జరిగిన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం సాధ్యమవుతుంది. ఈ పవిత్ర రోజున.. భారత దేశం మళ్లీ త్రేతా యుగంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తోంది. ఇక నుంచి అయోధ్యలో కాల్పుల కలకలం ఉండదు. ఖర్ఫ్యూ ఉండదు. ఇప్పుడు కేవలం దీపోత్సవం, రామోత్సవం మాత్రమే ఉంటాయి. శ్రీరామ నామంతో జరిగే సంకీర్తనలు అయోధ్యలో మారుమోగిపోతాయి." అని వ్యాఖ్యానించారు యోగి ఆదిత్యనాథ్​.

Ayodhya Ram Mandir photos : తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు.. ప్రధాని మోదీతో పాటు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​కు రామ మందిర ప్రతిమను బహుమతిగా ఇచ్చారు ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం.

Whats_app_banner

సంబంధిత కథనం