Ayodhya Ram Mandir Inauguration Live : ‘రాముడు వివాదం కాదు- రాముడు సమాధానం’
- Ayodhya Ram Mandir Inauguration Live : చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ బ్లాగ్‌ని ఫాలో అవ్వండి..
Mon, 22 Jan 202410:34 AM IST
పూలతో సత్కారం..
అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులపై పూల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. అనంతరం వారికి ధన్యవాదాలు తెలిపారు.
Mon, 22 Jan 202409:25 AM IST
ప్రజలకు మోదీ అభివాదం..
తన ప్రసంగం ముగిసిన అనంతరం.. రామ మందిర ప్రాంగణంలో ఉన్న ప్రముఖులు, సాధువులు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Mon, 22 Jan 202409:18 AM IST
యువతకు మోదీ పిలుపు..
భారత దేశ నిర్మాణానికి మన జీవితాన్ని ఇచ్చేందుకు భారతీయులు ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత దేశ యువకులు రెట్టింపు వేగంతో పనిచేయాలని అన్నారు.
Mon, 22 Jan 202409:12 AM IST
'దివ్య భారతాన్ని నిర్మించాలి..'
"రాముడి మందిరం నిర్మాణం జరిగింది. మరి తర్వాత ఏంటి? కోట్లాది మంది ప్రజల నిరీక్షణకు తెరపడింది. మరి తర్వాత ఏంటి? అని అందరు అనుకుంటున్నారు. కాల చక్రం మారుతోందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందుకే నేను ఎప్పుడు చెబుతాను.. 'ఇదే సమయం.. సరైన సమయం'. రామ మందిర నిర్మాణం నుంచి జరిగి.. భవ్య, దివ్య భారతాన్ని నిర్మించేందుకు ప్రజలు ముందుకు కదలాలి," అని మోదీ అన్నారు.
Mon, 22 Jan 202409:06 AM IST
రాముడు వివాదం కాదు- రాముడు సమాధానం..
"రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు. రాముడు మన వాడు కాదు. రాముడు అందరి వాడు. రాముడు వివాదం కాదు- రాముడు సమాధానం. రాముడు కేవలం ప్రస్తుతం కాదు.. రాముడు అనంతకాలం. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠతో నేడు ప్రపంచమంతా కలిసింది. భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. ఈరోజున.. రామ్ లల్లా ప్రతిష్ఠతో పాటు వసుదైక కుటుంబం ప్రతిష్ఠ కూడా జరిగింది," అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Mon, 22 Jan 202408:54 AM IST
‘మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడు..’
'మన ప్రార్థనల్లో ఏదో లోపం ఉండే ఉంటుంది. అందుకే.. రాముడికి గుడి ఇన్నేళ్ల పాటు సాధ్యం అవ్వలేదు. కానీ ఈరోజున.. మన లోపాలు దూరమయ్యాయని, మనల్ని రాముడి క్షమించాడని నేను భావిస్తున్నాను. మన రామ్ లల్లా ఇకపై టెంట్ల ఉండడు. మన రాముడు దివ్య మందిరంలో ఉంటాడు. ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు. రాముడి రాక వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. గర్భగుడిలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం నాకు మాటలు రావట్లేదు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు'
Mon, 22 Jan 202408:48 AM IST
ప్రధాని మోదీ ప్రసంగం..
అయోధ్యలో రాముడు ఇక టెంట్లో ఉండడని, దివ్యమైన మందిరంలో ఉంటాడని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 22 జనవరిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని, ఇది కేవలం ఒక తేదీ కాదని, ఇదొక.. కొత్త కాల చక్రం ప్రారంభమైన రోజు అని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్ని మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Mon, 22 Jan 202408:40 AM IST
'త్రేతా యుగంలోకి ప్రవేశించినట్టు ఉంది'
"500 ఏళ్ల నాటి కల నెరవేరింది. ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు మాటలు రావట్లేదు. అయోధ్య రామ మందిరాన్ని అనుకున్న చోట నిర్మించాము. ప్రధాని మోదీ దూరదృష్టి, సంకల్పం ఇందుకు కారణం. అయోధ్య అభివృద్ధికి కోట్ల కోట్ల నిధులు అందించారు. ఈ రోజున జరిగిన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం సాధ్యమవుతుంది. ఈ పవిత్ర రోజున.. భారత దేశం మళ్లీ త్రేతా యుగంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తోంది," అని వ్యాఖ్యానించారు యోగి ఆదిత్యనాథ్.
Mon, 22 Jan 202408:28 AM IST
యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం..
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయం బయట ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.
“ఎక్కడైతే రామునికి ఆలయం నిర్మించాలని అనుకున్నామో.. అక్కడే నిర్మాణం జరిగింది. ఈరోజున భారత దేశం మళ్లీ త్రేతా యుగంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తోంది,” అని యోగి అన్నారు.
Mon, 22 Jan 202408:15 AM IST
ఉపవాసాన్ని విరమించిన మోదీ..
అయోధ్య రామ మందిర ప్రారంభం నేపథ్యంలో 11 రోజుల పాటు మోదీ ఉపవాశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆ ఉపవాశాన్ని విరమించారు ప్రధాని.
Mon, 22 Jan 202408:08 AM IST
రామ మందిర ప్రతిమ..
అయోధ్య రామ మందిరం బయట ఏర్పాటు చేసిన ప్రాంగణంలో.. కొత్త కార్యక్రమం మొదలైంది. మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. కాగా.. మోదీకి.. రామ మందిర ప్రతిము బహుమతిగా ఇచ్చారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్.
Mon, 22 Jan 202407:53 AM IST
సాధువులతో మోదీ..
అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించిన అనంతరం.. సాధువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రధాని మోదీ.
Mon, 22 Jan 202407:34 AM IST
రామ్ లల్లా విగ్రహానికి హారతి..
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం.. రాముని విగ్రహానికి హారతి ఇచ్చారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Mon, 22 Jan 202407:28 AM IST
రాముని విగ్రహం చూడండి..
అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాల రాముని విగ్రహాన్ని కనులారా వీక్షించండి..
Mon, 22 Jan 202407:18 AM IST
కొనసాగుతున్న పూజలు..
అయోధ్య రామ మందిరం గర్భగుడిలో పూజలు కొనసాగుతున్నాయి.
Mon, 22 Jan 202407:02 AM IST
రామ్ లల్లా విగ్రహం ఆవిష్కరణ..
ప్రాణ ప్రతిష్ఠ పూజలో భాగంగా.. రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ..
Mon, 22 Jan 202406:55 AM IST
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో.. మోదీ, మోహన్ భాగవత్‌తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొన్నారు.
Mon, 22 Jan 202406:49 AM IST
బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ..
అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Mon, 22 Jan 202406:43 AM IST
ఆలయంలో మోదీ పూజలు..
సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయం లోపలికి వెళ్లారు ప్రధాని మోదీ. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిగింది. పూజల్లో.. మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సైతం పాల్గొన్నారు.
Mon, 22 Jan 202406:37 AM IST
రామ మందిరంలో ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అయోధ్య రామ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు.
Mon, 22 Jan 202406:36 AM IST
ఆలయ ప్రాంగణంలో పూల వర్షం..
రామ జన్మభూమి ప్రాంగణంలో హెలిక్టాప్టర్ వచ్చి పూల వర్షం కురిపించింది. ఆ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
Mon, 22 Jan 202406:24 AM IST
అయోధ్యలో ముకేశ్ అంబానీ..
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. తన కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్లారు. రామ జన్మభూమిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
Mon, 22 Jan 202406:06 AM IST
మాజీ ప్రధాని దేవె గౌడ వ్యాఖ్యలు..
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య చేరకున్నారు మాజీ ప్రధాని దేవె గౌడ. ఈ ప్రత్యేక పూజలు చేయడం అనేది.. ప్రధాని మోదీకి రాముడు ఇచ్చిన అవకాశం అని వ్యాఖ్యానించారు.
Mon, 22 Jan 202405:54 AM IST
రామ జన్మభూమిలో.. రామ నామ స్మరణ
రామ జన్మభూమి ప్రాంగణం.. రామ నామ స్మరణతో మారుమోగిపోతోంది. ప్రముఖ సింగర్ సోను నిగమ్.. ‘రామ్ సియ రామ్’ పాట పాడారు.
Mon, 22 Jan 202405:43 AM IST
అయోధ్యకు ప్రముఖులు..
బాలీవుడ నటులు రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, కట్రినా కైఫ్- విక్కీ కౌసల్తో పాటు మరికొంతమంది.. అయోధ్య రామ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు.
Mon, 22 Jan 202405:34 AM IST
అయోధ్యకు ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అయోధ్యకు చేరుకున్నారు. మరికాసేపట్లో.. రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకుంటారు.
Mon, 22 Jan 202405:28 AM IST
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక లైవ్ టెలికాస్ట్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ.. సుప్రీంకోర్టు వెళ్లింది. సోమవారం ఉదయం ఈ విషయంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. లైవ్ టెలికాస్ట్‌పై ఎలాంటి నిషేధం విధించకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘ఇతర మతాల వారు కూడా సమాజంలో ఉన్నారన్న ఒక్క కారణంతో లైవ్ టెలికాస్ట్ని అడ్డుకోకూడదు. భారత దేశంలో హోమోజీనియస్ సొసైటీ ఉంటుంది. అన్నింటికి గౌరవం ఇవ్వాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా.. లైవ్ టెలికాస్ట్‌లపై తాము ఎలాంటి నిషేధం విధించలేదని మొదటి నుంచి చెబుతూ వస్తోంది తమిళనాడు ప్రభుత్వం.
Mon, 22 Jan 202405:20 AM IST
చారిత్రక అయోధ్య నగరం..
రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యవాసులు కూడా ఈవెంట్ కోసం సిద్ధమయ్యారు. అయోధ్య నగరం శ్రీ రామ నామ స్మరణతో కోలాహలంగా మారింది. అందమైన పువ్వులతో అయోధ్య వీధులను సుందరంగా అలకరించారు. వీధులు, ఫ్లైఓవర్లపై రాముడి బొమ్మలు చిత్రీకరించారు. ప్రతి వీధిలోనూ రాముడి పాటలే వినిపిస్తున్నాయి.
Mon, 22 Jan 202405:09 AM IST
జియో టీవీలో నిరంతర లైవ్ టెలికాస్ట్..
జియో వినియోగదారులకు కీలక విజ్ఞప్తి చేసింది సంస్థ. జియోటీవీ, జియోటీవీ+, జియోన్యూస్లో రామ మందిర ప్రారంభోత్సవాన్ని లైవ్‌లో చూడవచ్చని పేర్కొంది. ఇందుకోసం దూరదర్శన్‌తో కొలాబరేట్ అయినట్టు తెలిపింది.
Mon, 22 Jan 202405:02 AM IST
వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రజలు లైవ్ టెలికాస్ట్‌లో వీక్షించే విధంగా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు స్కూళ్లకు సెలవు కూడా ప్రకటించాయి. యూపీ, అసోం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, త్రిపుర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ హాలీడే కూడా నడుస్తోంది.
Mon, 22 Jan 202404:57 AM IST
అయోధ్యలో ఆర్ఎస్ఎస్ ఛీఫ్..
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్ అయోధ్యలోని రామ జన్మభూమికి చేరుకున్నారు.
మరోవైపు వ్యాపారవేత్త అనిల్ అంబానీ సైతం రామ మందిర ప్రాంగణం వద్ద కనిపించారు.
Mon, 22 Jan 202404:49 AM IST
భద్రతా వలయంలో అయోధ్య
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు.. 7వేల మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోస్తును ఏర్పాటు చేశారు అధికారులు. చారిత్రక అయోధ్య నగరం.. భద్రతా వలయంలోకి జారుకుంది. నగరంలోని అనేక చోట్లు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కెమికల్, బయొలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను అడ్డుకునే విధంగా శిక్షణ పొందిన అనేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. సోమవారం ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షించనున్నాయి.
Mon, 22 Jan 202404:40 AM IST
అయోధ్యలో చిరంజీవి, రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్.. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మరికొంత సేపట్లో.. రామ జన్మభూమికి వెళ్లనున్నారు.
Mon, 22 Jan 202404:25 AM IST
అయోధ్యలో యూపీ సీఎం..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అయోధ్య రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
Mon, 22 Jan 202404:17 AM IST
దేశ.. విదేశాల్లో.. రామ నామం
ఇండియాలోనే కాకుండా.. విదేశాల్లో కూడా రామ మందిరం వైబ్స్ కనిపిస్తున్నాయి! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో.. అమెరికా వాషింగ్టన్ డీసీ, జర్మనీ ప్యారిస్, ఆస్ట్రేలియా సిడ్నీతో పాటు వివిధ దేశాల్లో.. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. వీటిని విశ్వ హిందు పరిషద్, 60 దేశాల్లోని హిందు సమాజాలు నిర్వహిస్తున్నాయి.
Mon, 22 Jan 202404:02 AM IST
అయోధ్యకు ప్రముఖులు..
రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. విక్కీ కౌసల్, కట్రీనా కైఫ్ సహా అనేక మంది ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారు.
Mon, 22 Jan 202403:49 AM IST
స్టాక్ మార్కెట్లకు సెలవు..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు పబ్లిక్ హాలీడే ప్రకటించింది. ఫలితంగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నేడు మూతపడ్డాయి.
Mon, 22 Jan 202403:48 AM IST
పబ్లిక్ హాలీడే..
రామ మందిర ప్రారంభోత్సవాన్ని కనులారా చూసేందుకు.. బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రభుత్వం కూడా.. పబ్లిక్ హాలీడేని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం.. తమ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ఇచ్చింది.
Mon, 22 Jan 202403:48 AM IST
టీవీలో లైవ్ టెలికాస్ట్..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్ ద్వారా వీక్షిస్తారని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీవీతో పాటు ఆన్లైన్ వేదికల్లో ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రశారం చేయనుంది.
Mon, 22 Jan 202403:48 AM IST
అయోధ్యలో ప్రధాని మోదీ..
రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్యవాసులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. మోదీ అయోధ్యకు వెళ్లిన తర్వాత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, సంప్రదాయాలు, వైదిక ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం.. 7వేల మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసగిస్తారు ప్రధాని మోదీ.
Mon, 22 Jan 202403:47 AM IST
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం..
కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరేందుకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం.. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మొదలవుతుంది. ఇందులో.. అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.