Prashanthi Harathi: నేను ఇప్పటికీ సునీల్ భార్యనే.. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు హీరోయిన్-pellam oorelithe actress prashanthi harathi about sunil wife role and movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prashanthi Harathi: నేను ఇప్పటికీ సునీల్ భార్యనే.. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు హీరోయిన్

Prashanthi Harathi: నేను ఇప్పటికీ సునీల్ భార్యనే.. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు హీరోయిన్

Sanjiv Kumar HT Telugu
Mar 27, 2024 01:16 PM IST

Prashanthi Harathi About Her Acting Life: పెళ్లాం ఊరెళితే సినిమాలో కమెడియన్ సునీల్‌కు భార్యగా నటించిన ప్రశాంతి హారతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ప్రశాంతి తన యాక్టింగ్ కెరీర్, జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నేను ఇప్పటికీ సునీల్ భార్యనే.. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు హీరోయిన్
నేను ఇప్పటికీ సునీల్ భార్యనే.. 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు హీరోయిన్

Prashanthi Harathi About Movies: సినిమాల్లోని కొన్ని పాత్రలు అలాగే గుర్తుండిపోతాయి. ఆ పాత్ర తర్వాత ఎన్నాళ్లకు వారు కనిపించిన ఈజీగా గుర్తుపట్టేస్తారు. అలాంటి పాత్ర చేసి దాదాపు 20 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన నటి ప్రశాంతి హారతి. పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంతి హారతి. పెళ్లాం ఊరెళితే సినిమాలో సునీల్‌కు అమాయకపు భార్యగా నటించిన ప్రశాంతిని గుర్తు పట్టడం చాలా సులభమే.

అయితే, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్‌లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్‌తోనే మళ్లీ టాలీవుడ్‌కు రావాలని అనుకుంటున్నానని తాజా ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి తెలిపారు. మరి ఆమె చెప్పిన విశేషాల్లోకి వెళితే..

"మా కుటుంబం విశాఖలో ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. మా ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాతావరణం ఉండేది. మూవీస్ చూసేందుకు నన్నూ పంపేవారు కాదు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఆ ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు" అని ప్రశాంతి తెలిపారు.

"కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేసిన ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ గారు నిర్మించిన రూపాయి అనే చిత్రంలో నటించాను. ఇంతలో బాలాజీ టెలీ ఫిలింస్ వారి సీరియల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. అలా ముంబై వెళ్లాను. ఆ తర్వాత ఇంద్ర సినిమా కోసం అడిగారు. ఆ చిత్రంలో నటించాను. అలా నా కెరీర్ కొనసాగింది" అని ప్రశాంతి చెప్పారు.

"పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చాను. అక్కడి పిల్లలకు తెలుగు తెలియదు. క్లాసికల్ డ్యాన్స్ పాటల్లోని అర్థాలను ఇంగ్లీష్‌లో వివరించి చెప్పేవాళ్లం. అప్పుడు వారికి అర్థమై నేర్చుకునేవారు" అని ప్రశాంతి పేర్కొన్నారు.

"మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. మా పాప తాన్యతో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియో రూపొందించాం. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. తెలుగింటి సంస్కృతికి మంచి రెస్పాన్స్ దక్కడం సంతోషాన్ని కలిగించింది. మా పాప తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు. తన ఏజ్‌కు తగిన మంచి అవకాశం వస్తే పాప తాన్యను కూడా సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు" అని ప్రశాంతి తెలిపారు.

"నేను యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలేదు. అయితే క్లాసికల్ డ్యాన్సర్ ను కాబట్టి నటిగా తెలియకుండానే పరిణితి ఏర్పడింది. నవ్వడం, ఏడ్వడం వంటి భావోద్వేగాలు ఇలా చెబితే అలా చేసేసేవాళ్లం. దానికి ప్రాక్టీస్ కూడా అవసరం లేకుండేది. ఈ ఆత్మవిశ్వాసంతోనే సినిమాలు, సీరియల్స్ చేశాను. అప్పట్లో మీడియా ప్రభావం ఇంత ఉండేది కాదు. చేస్తే సినిమాలు లేకుంటే సీరియల్స్. ఓటీటీలు లేవు. ఇప్పుడు వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ తో ఔత్సాహిక నటీనటులకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్‌కు రావాలి అనిపించింది. నటిగా నాకున్న ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నాను" అన్నారు.

"మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి.. ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. ప్రేక్షకుల దృష్టిలో నేను ఇప్పటికీ సునీల్ భార్యనే. కథలో కీలకంగా ఉండి అలాంటి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను" అని ప్రశాంతి హారతి చెప్పుకొచ్చారు.

Whats_app_banner