Top Rated crime thriller web series: టాప్ ఐఎండీబీ రేటింగ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే
Top Rated crime thriller web series: ఇండియాలో టాప్ ఐఎండీబీ రేటింగ్ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో చూడొచ్చు.
Top Rated crime thriller web series: వెబ్ సిరీస్‌లలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఇండియాలో వచ్చిన సిరీస్ లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నవి ఈ జానర్ సిరీస్‌లే. మరి వీటిలో టాప్ ఐఎండీబీ రేటింగ్ కలిగినవి ఏవి? వాటిని ఏ ఓటీటీల్లో చూడాలి అనేవి ఇక్కడ చూడండి. ఈ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ లాంటి టాప్ వెబ్ సిరీస్ ఉన్నాయి.
టాప్ ఐఎండీబీ రేటెడ్ వెబ్ సిరీస్
ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) రేటింగ్స్ ను చాలా వరకు ప్రామాణికంగా తీసుకుంటారు. సాధారణ ప్రేక్షకులు ఇందులో వివిధ వెబ్ సిరీస్, మూవీస్ కి తమ రేటింగ్స్ ఇస్తుంటారు. రివ్యూలు, పెయిడ్ ప్రమోషన్లతో పోలిస్తే ఈ ఐఎండీబీ రేటింగ్స్ ను చాలా వరకు ప్రేక్షకులు విశ్వసిస్తుంటారు. మరి అలాంటి ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏవో చూసేయండి.
స్కామ్ 1992 - సోనీలివ్
స్కామ్ 1992 వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీ ఒరిజినల్. 1992లో దేశాన్ని ఊపేసిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ ను కళ్లకు కట్టిన ఈ వెబ్ సిరీస్ ఐఎండీబీలో ఇప్పటికీ టాప్ రేటెడ్ సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ కు ఏకంగా 10కి 9.3 రేటింగ్ రావడం విశేషం. ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా డైరెక్ట్ చేయగా.. ఇందులో హర్షద్ పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీకి మంచి పేరు వచ్చింది.
ది ఫ్యామిలీ మ్యాన్ - ప్రైమ్ వీడియో
మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ కు ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. కశ్మీర్ ఉగ్రవాదం, ఢిల్లీలో మారణహోమాన్ని సృష్టించడానికి వాళ్లు చేసే ప్రయత్నాన్ని ఓ ఫ్యామిలీ మ్యాన్ లా ఉండే సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడన్నదే ఈ సిరీస్ స్టోరీ.
స్పెషల్ ఓపీఎస్ - హాట్‌స్టార్
ప్రముఖ నటుడు కేకే మేనన్ నటించిన ఈ స్పెషల్ ఓపీఎస్ వెబ్ సిరీస్ 8.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది. మన రా (RAW), ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల ఆటకట్టించడానికి ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తాయన్నది ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. 2001లో పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడి కోసం సాగించే వేటను ఇందులో చూడొచ్చు.
సేక్రెడ్ గేమ్స్ -నెట్‌ఫ్లిక్స్
ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన అత్యంత హింసాత్మక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఈ సేక్రెడ్ గేమ్స్ ఒకటి. నెట్‌ఫ్లిక్స్ లో రెండు సీజన్లు పూర్తయ్యాయి. వీటిలో తొలి సీజన్ కు 8.5 రేటింగ్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీలాంటి వాళ్లు ఇందులో నటించారు.
మీర్జాపూర్ - ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి 8.5 రేటింగ్ ఉంది.
ఢిల్లీ క్రైమ్ - నెట్‌ఫ్లిక్స్
ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ కూడా మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 2012లో జరిగిన నిర్భయ అత్యాచారం ఘటన నేపథ్యంలో తొలి సీజన్ తెరకెక్కింది. రెండో సీజన్లో కచ్చా బనియన్ గ్యాంగ్ అకృత్యాలను చూపించారు.