Prime Video OTT Web Series: మీర్జాపూర్ 3తో పాటు మరో రెండు సిరీస్‍ల సీక్వెల్స్‌పై అనౌన్స్‌మెంట్స్.. ఆ విషయంలో నిరాశే!
Amazon Prime Video Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కొన్ని పాపులర్ వెబ్ సిరీస్‍లకు సీక్వెల్ సీజన్‍లను ప్రకటించింది. నేడు జరిగిన ఈవెంట్‍లో ఈ కీలక అనౌన్స్‌మెంట్లు చేసింది. వీటిలో మీర్జాపూర్ 3, పంచాయత్ 3 సహా మరిన్ని సిరీస్‍లు ఉన్నాయి.
Amazon Prime Video: ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ముంబైలో నేడు (మార్చి 19) ఈ ఈవెంట్ జరిగింది. వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‍లో కొన్ని సినిమాలను, వెబ్ సిరీస్‍లను ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని పాపులర్ వెబ్ సిరీస్‍లకు సీక్వెల్‍లను అనౌన్స్ చేసింది. మీర్జాపూర్ సీజన్ 3 సహా మరిన్ని సిరీస్‍ల గురించి వెల్లడించింది.
మీర్జాపూర్ సీజన్ 3
మీర్జాపూర్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఇప్పటి వరకు రెండు సీజన్లు వచ్చాయి. భారీ సక్సెస్ అయ్యాయి. దీంతో మీర్జాపూర్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడో సీజన్‍ను నేటి ఈవెంట్‍లో అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
“కిరీటం దక్కించుకునేందుకు గుడ్డూ (అలీ ఫైజల్), గోలు (శ్వేత త్రిపాఠి)కు కొత్త పోటీదారుడితో తలపడనున్నారు. మరి వారికి అధికారం దక్కుతుందా.. లేదా బయటి శక్తులతో ఆ పవర్ ఫుల్ సీట్ శాశ్వతంగా నాశనం అవుతుందా?” అని ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో వెల్లడించింది. అగ్నిలో దగ్ధమవుతున్న కుర్చీని పోస్ట్ చేసింది. మీర్జాపూర్ సీజన్ 3లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, రసిక దుగల్, విజయ్ వర్మ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకులుగా ఉన్నారు.
పంచాయత్ సీజన్ 3
పంచాయత్ వెబ్ సిరీస్‍లో తొలి రెండు సీజన్లు కూడా సూపర్ పాపులర్ అయ్యాయి. దీంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకుల నిరీక్షణ కొనసాగుతోంది. ఈ సీజన్ 3ను కూడా నేడు ప్రకటించింది ప్రైమ్ వీడియో. మురికి నీళ్లు చుట్టూ తిరిగే ఫులేరా గ్రామ రాజకీయాల్లో అభిషేక్ నిష్పాక్షికంగా ఉండేందుకు కృషి చేస్తాడంటూ పంచాయత్ సీజన్ 3 పోస్టర్ రిలీజ్ చేసింది ప్రైమ్ వీడియో.
పంచాయత్ సీజన్ 3లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, సన్విక, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీజన్‍కు చందన్ కుమార్ కథ అందించగా.. దీవక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.
పాతాళ్ లోక్ సీజన్ 2
రెండేళ్ల కిందట వచ్చిన పాతాళ్ లోక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్‍కు సీక్వెల్ వస్తోంది. పాతాళ్ లోక్ సీజన్ 2ను ప్రైమ్ వీడియో నేడు అనౌన్స్ చేసింది. రెండు పరస్పర సంబంధం లేని కేసులను హథిరామ్ (జగదీప్ అహ్లావత్), అన్సారీ (ఇష్వాక్ సింగ్) ఛేదించడం చుట్టూ ఈ సీజన్ ఉంటుందని హింట్ ఇచ్చింది.
పాతాళ్ లోక్ సీజన్ 2లో జగదీప్ అహ్లావత్, ఇష్వాక్ సింగ్, తిలోత్తమ షోమ్, జాహ్ను బరువా, గుల్ పనగ్, నగేశ్ కుకునూర్, అనురాగ్ అరోరా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ శర్మ క్రియేటర్‌గా ఉన్న ఈ సీజన్‍కు అవినాశ్ అరుణ్ ధవారే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ విషయంలో నిరాశ
మీర్జాపూర్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 3, పాతాళ్ లోక్ సీజన్ 2 గురించి అధికారికంగా ప్రకటన వచ్చినా.. స్ట్రీమింగ్ డేట్లను అమెజాన్ ప్రైమ్ వీడియో ఖరారు చేయలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నది హింట్ ఇవ్వలేదు. ఈ విషయంలో కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సిరీస్‍ల స్ట్రీమింగ్ డేట్‍లను కూడా ఈ ఈవెంట్‍లో ప్రకటిస్తుందని ఆశించామని, కానీ నిరాశే ఎదురైందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సీజన్‍ల షూటింగ్‍లను బట్టి స్ట్రీమింగ్ డేట్‍లను ప్రైమ్ వీడియో ఖరారు చేయనుంది.