Thalapathy Vijay Son: డైరెక్టర్‌గా దళపతి విజయ్ కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ
Thalapathy Vijay Son: దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. తన డెబ్యూ మూవీని టాలీవుడ్ హీరో సందీప్‌కిషన్‌తో చేయబోతున్నట్లు సమాచారం. జాసన్ విజయ్ ఫస్ట్ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
హీరోల కొడుకులు హీరోలు కావడం బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కనిపిస్తుంది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా అడుగులు వేస్తోన్నాడు. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు.
లైకా ప్రొడక్షన్స్‌లో...
జాసన్ సంజయ్ తన డెబ్యూ మూవీని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సందీప్‌కిషన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా జాసన్ సంజయ్ ఈ సినిమా కథను రాసుకున్నట్లు చెబుతోన్నారు. జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీకి తమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే జాసన్ విజయ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ధృవ్ విక్రమ్ అనుకున్నారు కానీ...
తొలుత ఈ సినిమాలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అనివార్య కారణాల వల్ల ధృవ్ విక్రమ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ధృవ్ విక్రమ్ స్థానంలో సందీప్‌కిషన్ ఈ మూవీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
వెట్టైకారన్ మూవీలో...
లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో జాసన్ సంజయ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఆ తర్వాత కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. తండ్రి విజయ్ హీరోగా నటించిన వెట్టైకారన్ మూవీలో జాసన్ సంజయ్ ఓ సాంగ్‌లో తళుక్కున మెరిశాడు. హీరోగా పలు ఆఫర్స్ వచ్చిన డైరెక్షన్‌పై మక్కువతో జాసన్ సంజయ్ ఆ ఆఫర్స్‌ను తిరస్కరించినట్లు సమాచారం. భవిష్యత్తులో తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
రాయన్‌లో నెగెటివ్ క్యారెక్టర్...
మరోవైపు ఇటీవల రిలీజైన రాయన్ మూవీతో తమిళంలో పెద్ద హిట్‌ను అందుకున్నాడు సందీప్‌కిషన్. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో సందీప్‌కిషన్ కనిపించాడు. బాక్సాఫీస్ వద్ద 160 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన రాయన్...ఈ ఏడాది కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ధనుష్ హీరోగా సంక్రాంతికి రిలీజైన కెప్టెన్ మిల్లర్‌లో సందీప్‌కిషన్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించాడు.
మిక్స్‌డ్ టాక్...
తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ఊరు పేరు భైరవకోన మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ప్రస్తుతం ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో పాటు యాక్షన్ కామెడీ మూవీ చేస్తోన్నాడు సందీప్ కిషన్.
నాలుగు రోజుల్లో 280 కోట్లు...
కాగా దళపతి విజయ్ హీరోగా నటించిన ది గోట్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 280 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. వెంకట్ ప్రభు ఈ మూవీని దర్శకత్వం వహించాడు.