The Goat Review: ది గోట్ రివ్యూ - హీరో ... విలన్‌గా దళపతి విజయ్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
The Goat Review: దళపతి విజయ్ ది గోట్ మూవీ గురువారం థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈమూవీ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.
The Goat Review: దళపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) మూవీ సెప్టెంబర్ 5న (గురువారం ) తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు. ది గోట్ మూవీ ఎలా ఉంది? విజయ్‌కి డైరెక్టర్ వెంకట్ ప్రభు హిట్టిచ్చాడా? లేదా? అంటే?
గాంధీ వర్సెస్ జీవన్
గాంధీ (దళపతి విజయ్) యాంటీటెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ కళ్యాణ సుందరం (ప్రభుదేవా), సునీల్(ప్రశాంత్), అజయ్‌లతో కలిసి ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేస్తాడు. తాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తోన్న విషయం భార్య అను ( స్నేహ) దగ్గర గాంధీ దాచిపెడతాడు.
ఓ సీక్రెట్ మిషన్‌లో జరిగిన ఎటాక్‌లో కొడుకు జీవన్‌ను (విజయ్)కోల్పోతాడు గాంధీ. భర్త జాబ్ వల్లే కొడుకు చనిపోయాడనే కోపంతో గాంధీకి దూరంగా వెళ్లిపోతుంది అను. కొడుకు దూరమైన బాధలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాబ్ వదిలేస్తాడు గాంధీ. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పనిచేయడం మొదలుపెడతాడు.
పదిహేనేళ్ల తర్వాత చనిపోయాడని అనుకున్న కొడుకు జీవన్‌ను అనుకోకుండా గాంధీ కలుస్తాడు. జీవన్ తిరగొచ్చిన తర్వాత గాంధీ లైఫ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. అతడితో కలిసి స్క్వాడ్‌లో పనిచేసిన వాళ్లతో పాటు సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.
ఈ హత్యలు చేస్తుంది ఎవరు? గాంధీ తలపెట్టిన ఓ సీక్రెట్ మిషన్ నుంచి ప్రాణాలతో బయటపడిన మీనన్(మోహన్)అతడిపై రివేంజ్ తీర్చుకోవానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? తాను వెతుకుతున్న శత్రువు కొడుకు జీవన్ అని తెలిసి గాంధీ ఏం చేశాడు? ఈ తండ్రీకొడుకుల పోరాటం చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ది గోట్ మూవీ కథ.
విజయ్ మార్కు మూవీ...
ది గోట్ ఫక్తు దళపతి విజయ్ మార్కు కమర్షియల్ మూవీ. విజయ్ సినిమా అంటేనే స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, హీరోయిజం, డ్యాన్సులు ఉండాలని అభిమానులు ఆశిస్తుంటారు. కథ సింపుల్‌గా ఉన్నా సరే కమర్షియల్ హంగులు వర్కవుట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో లియోతో పాటు విజయ్ గత సినిమాలు నిరూపించాయి.
ది గోట్‌తో దర్శకుడు వెంకట్ ప్రభు ఇదే రూట్‌ను ఫాలో అయ్యాడు. కథ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లలేదు. తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు....వీరిద్దరిపోరాటంలో గెలుపు ఎవరిది అన్నదే గోట్ మూవీ కథ. ఈ సింపుల్ స్టోరీని మూడు గంటల నిడివితో చెప్పడానికి వెంకట్ ప్రభు అన్ని అస్త్రాలు వాడాడు. జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేశాడు. అందులో కొన్ని వర్కవుట్ అయితే కొన్ని బెడిసికొట్టాయి.
యాక్షన్ ఎపిసోడ్‌తో షురూ...
ఏఐలో విజయ్ కాంత్ కనిపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తోనే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ సీన్స్ వైపు కథను టర్న్ చేసి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నడిపించాడు దర్శకుడు. తమిళ వాసనలతో సాగే సెంటిమెంట్, కామెడీ యావరేజ్‌గానే ఉంది.
గాంధీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తోన్న విషయం అతడి భార్యకు తెలిసిపోయే సీన్, అక్కడ వచ్చే ఛేజింగ్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకుంటుంది. చనిపోయాడనుకున్న జీవన్ తిరిగి రావడం, తండ్రిపై పగతో అతడి ఆప్తులను ఒక్కొక్కరిని చంపే సీన్స్‌తో సెకండాఫ్‌ను థ్రిల్లింగ్‌గా నడిపించాడు. తండ్రి, కొడుకులు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ స్క్రీన్‌ప్లేను ఎంగేజింగ్‌గా రాసుకున్నారు.
స్టేడియం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ ఐడియా బాగుంది. ఓ పక్క ధోనీ బ్యాటింగ్, మరో పక్క విజయ్ ఫైటింగ్...శివకార్తికేయన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి.
నిడివి ఎక్కువే...
సినిమా లెంగ్త్ పెద్ద మైనస్‌గా మారింది. మూడు గంటల సినిమాలో ఈజీగా ముప్పైనిమిషాలపైనే లేపేయచ్చనిపిస్తుంది. సాంగ్స్, బీజీఎమ్ ఇంప్రెసివ్‌గా లేకపోవడం ది గోట్‌కు డ్రా బ్యాక్ అయ్యింది.
రెండు పాత్రల్లో...
గాంధీ, జీవన్ రెండు పాత్రల్లో దళపతి విజయ్ వేరియేషన్ చూపించిన విధానం, యాక్టింగ్ బాగున్నాయి. డ్యాన్సుల్లో అదరగొట్టాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకటి, రెండు సీన్లకే పరిమితమైంది. ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, జయరాయ్ ఇలా సినిమాలో చాలా మంది సీనియర్ నటులు కనిపిస్తారు. విజయ్‌నే ఎక్కువగా హైలైట్ చేయడానికి వారి పాత్రలకు అంతగా ప్రాధాన్యతలేని ఫీలింగ్ కలుగుతుంది. చివరలో త్రిష ఐటెంసాంగ్ మాస్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.
విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రమే...
ది గోట్ విజయ్ ఫ్యాన్స్‌ను మెప్పించే కమర్షియల్ యాక్షన్ మూవీ. కథ విషయంలో కొత్తదనం మాత్రం లేదు. డ్యూయల్ రోల్‌లో విజయ్ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు.