Star Maa Serials 2024: స్టార్ మాలోకి ఈ ఏడాది కొత్తగా వచ్చిన సీరియల్స్ ఇవే.. టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్
Star Maa Serials 2024: స్టార్ మాలోకి ఈ ఏడాది చాలానే కొత్త సీరియల్స్ రావడం విశేషం. అంతేకాదు వీటిలో చాలా వరకు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లోనూ టాప్ లో నిలుస్తున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.
Star Maa Serials 2024: స్టార్ మా తెలుగులో టాప్ ఛానెల్. ఇందులో వచ్చే సీరియల్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం టీఆర్పీల విషయంలో స్టార్ మా సీరియల్స్ ను మించినవి లేవు. ఈ విషయంలో దూకుడుగా వెళ్తున్న ఆ ఛానెల్.. 2024లోనూ చాలా కొత్త సీరియల్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏకంగా 9 కొత్త సీరియల్స్ ఈ ఛానెల్లో అడుగుపెట్టడం విశేషం.
2024లో వచ్చిన స్టార్ మా సీరియల్స్
స్టార్ మా ఛానెల్లోకి 2024లో కొత్తగా 9 సీరియల్స్ వచ్చాయి. వాటిలో కార్తీకదీపం 2, చిన్ని, మగువ ఓ మగువ, ఇల్లు ఇల్లాలు పిల్లలు లాంటి టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్స్ కూడా ఉన్నాయి. వీటితోపాటు నిన్ను కోరి, గీత ఎల్ఎల్‌బీ, ఇంటింటి రామాయణం, ఎటో వెళ్లిపోయింది మనసు, నువ్వుంటే నా జతగా సీరియల్స్ కూడా ఈ ఏడాదే స్టార్ మాలోకి వచ్చాయి.
అంటే ఈ ఏడాది సగటును 40 రోజులకో కొత్త సీరియల్ ను ఈ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇది మామూలు విషయం కాదు. సీరియల్స్ తోపాటు ఇంట్రెస్టింగ్ టీవీ షోలతోనూ తెలుగులో స్టార్ మా నంబర్ వన్ ఛానెల్ గా కొనసాగుతోంది. అటు దేశవ్యాప్తంగానూ రెండో స్థానంలో ఉండటం విశేషం. స్టార్ మాకు యావరేట్ మినట్ ఆడియెన్స్ 2415.92గా ఉంది. టాప్ లో దంగల్ ఛానెల్ 2673 ఏఎంఏతో ఉంది.
టీఆర్పీ రేటింగ్స్‌లో అన్నీ టాపే
స్టార్ మాలోకి 2024లో అడుగుపెట్టిన సీరియల్స్.. టీఆర్పీ రేటింగ్స్ లోనూ దూసుకెళ్తుండటం విశేషం. ఈ ఏడాది కొత్తగా వచ్చిన సీరియల్స్ లో ఐదు టాప్ 5లో ఉన్నాయంటే నమ్మగలరా? కార్తీకదీపం రెండో సీజన్ ఈ ఏడాదే వచ్చింది. మొదట్లో చాలా రోజుల పాటు బ్రహ్మముడి తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ సీరియల్.. ఇప్పుడు టాప్ లో ఉంది.
49వ వారానికి రిలీజైన రేటింగ్స్ లో కార్తీకదీపం 11.91 సాధించింది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.92తో రెండో స్థానంలో, చిన్ని 10.76తో మూడో స్థానంలో, ఇంటింటి రామాయణం 10.29తో నాలుగో స్థానంలో, మగువ ఓ మగువ 9.86తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ మధ్యే స్టార్ మాలోకి వచ్చిన గీత ఎల్ఎల్‌బీ, నిన్ను కోరిలాంటి సీరియల్స్ కూడా మెల్లగా మంచి రేటింగ్స్ సాధిస్తున్నాయి.
స్టార్ మా దెబ్బకు మిగిలిన తెలుగు ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ రేటింగ్స్ లో వెనుకబడిపోతున్నాయి. డిసెంబర్ నెలలోనే స్టార్ మా గీత ఎల్ఎల్‌బీ, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ ను తీసుకొచ్చింది. మరి రానున్న రోజుల్లో ఈ సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.