OTT Romantic Drama: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శోభితా ధూళిపాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Romantic Drama: లవ్ సితార చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాలో శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇటీవలి కాలంలో దూకుడుగా సినిమాలను తీసుకొస్తోంది. డైరెక్ట్ స్ట్రీమింగ్ చిత్రాలను వరుసగా అందుబాటులోకి తెస్తోంది. స్టార్ నటి శోభితా ధూళిపాళ్ల నటించిన ‘లవ్ సితార’ చిత్రం జీ5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీలో శోభితాతో పాటు రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్ పోషించారు. షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు రెడీ అయింది. అది కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
లవ్ సితార చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (సెప్టెంబర్ 10) అధికారికంగా వెల్లడించింది. సంప్రదాయ వస్త్రధారణలో శోభితా ధూళిపాళ్ల నవ్వుతూ ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో పాటే స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.
రొమాంటిక్ ఎమోషనల్ మూవీగా లవ్ సితార ఉండనుందని తెలుస్తోంది. “లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించిన కథ ఇది. సెప్టెంబర్ 27న లవ్ సితార జీ5లో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ఓటీటీ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లవ్ సితార చిత్రానికి వందన్ కటారియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శోభితా, రాజీవ్‍తో పాటు శంకర్ ఇంద్రఛూడన్, రిజుల్ రే, సీమా సాన్వీ కూడా కీలకపాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది.
చాలా ఆలస్యంగా..
లవ్ సితార సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. 2020లోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అయితే, కరోనా రావడం సహా మరిన్ని కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం అడుగుపెడుతోంది. ముందు నుంచి ఈ మూవీని ఓటీటీ కోసమే మేకర్స్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లవ్ సితార మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది.
లవ్ సితార చిత్రాన్ని ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రీవాలా నిర్మించారు. మోస్తరు బడ్జెట్‍తో ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీలో లవ్, ఎమోషన్లతో పాటు కాస్త కామెడీతోనే డైరెక్టర్ వందన కటారియా. ఈ సినిమా లవ్, యాక్సప్టెన్స్, క్షమించడం చుట్టూ సాగుతుందని గతంలో మేకర్స్ హింట్ ఇచ్చారు.
కాగా, శోభితా ధూళిపాళ్లకు ఇటీవలే టాలీవుడ్ హీరో నాగచైతన్యతో ఎంగేజ్‍మెంట్ జరిగింది. త్వరలోనే వారి వివాహం జరగనుంది.
బెర్లిన్ కూడా నేరుగానే..
జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 13వ తేదీన బెర్లిన్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో అపర్‌శక్తి ఖురానా, ఇశ్వాక్ సింగ్, రాహుల్ బోస్ లీడ్ రోల్స్ చేయగా.. అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కబీర్ బేడీ, అనుప్రియ గోయెంక కూడా కీరోల్స్ చేశారు. విదేశీ గాఢచారిగా భావించి ఓ బధిరుడిని అరెస్ట్ చేసి విచారించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5లో బెర్లిన్ చిత్రాన్ని చూడొచ్చు. జీ స్టూడియోస్, యిప్పీ కీ యాయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు చిత్రాన్ని నిర్మించాయి.