Naga Chaitanya Sobhita Engagement: అందుకే హడావుడిగా చైతూ, శోభిత ఎంగేజ్‍మెంట్: నాగార్జున
Naga Chaitanya - Sobhita Sobhita Dhulipala Engagement: హీరో నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ ఇప్పుడు హాట్‍టాపిక్‍గా మారింది. ముందుగా ప్రకటించకుండానే ఈ వేడుక జరిగింది. అయితే, హడావుడిగా ఎంగేజ్‍మెంట్ ఎందుకు చేశారో వెల్లడించారు నాగార్జున.
టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల డేటింగ్‍లో ఉన్నారని చాలా కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. సమంతతో 2021లో చైతూ విడిపోయారు. ఆ తర్వాత శోభితాతో ప్రేమలో పడ్డారనే సమాచారం చక్కర్లు కొట్టింది. ఈ విషయంలో నాగచైతన్య, శోభితా మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అయితే, గురువారం (ఆగస్టు 8) వారిద్దరి ఎంగేజ్‍మెంట్ జరిగింది. ముందుగా ప్రకటన చేయకుండానే ఈ వేడుకను అక్కినేని కుటుంబం నిర్వహించింది. పెద్దగా అతిథులను కూడా ఆహ్వానించలేదు. అయితే, తన కుమారుడి ఎంగేజ్‍మెంట్‍ను అంత హడావుడిగా చేసేందుకు కారణమేంటో కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా వెల్లడించారు.
మంచి ముహూర్తం ఉన్నందుకే..
ఆగస్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందుకే అప్పటికప్పుడు నాగచైతన్య - శోభితా ఎంగేజ్‍మెంట్ నిర్వహించామని ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు నాగార్జున. అందుకే హడావుడిగా వేడుక చేశామని స్పష్టం చేశారు. “అది మంచి ముహూర్తం ఉన్న రోజు కావటంతో హడావుడిగా ఎంగేజ్మెంట్ చేశాం. చైతూ, శోభితా పెళ్లి చేసుకోవాలని కచ్చితంగా అనుకున్నారు. అందుకే ఇక నిశ్చితార్థం చేసేద్దాం అని మేం అనుకున్నాం” అని వెల్లడించారు.
అప్పుడు డిప్రెషన్.. ఇప్పుడు హ్యాపీ
సమంతతో విడాకులు అయ్యాక నాగచైతన్య డిప్రెషన్‍లోకి వెళ్లాడని, చాలా బాధపడ్డాడని నాగార్జున తెలిపారు. చైతూ ఎక్కువగా తన ఫీలింగ్స్ బయటపెట్టడని, కానీ అతడు బాధతో ఉన్నాడని తనకు అర్థమయ్యేదని చెప్పారు. శోభితా వల్ల నాగచైతన్య మళ్లీ ఆనందంగా ఉన్నాడని, అతడు మళ్లీ నవ్వడం చూసి తమ కుటుంబం చాలా ఊరట పొందుతోందని నాగార్జున అన్నారు.
“నాగచైతన్యకు, మా కుటుంబానికి అది (సమంతతో విడాకులు) అంత సులువైన సమయం కాదు. చైతూను డిప్రెషన్‍లోకి వెళ్లేలా చేసింది. నా కొడుకు ఫీలింగ్స్ ఎక్కువగా చూపించడు. కానీ అతడు ఆనందంగా లేడని నాకు తెలుసు. ఇప్పుడు అతడు మళ్లీ నవ్వుతున్నాడు. శోభితా, చై అద్భుతమైన జంట. ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటున్నారు” అని నాగార్జున అన్నారు.
నాగచైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల ప్రేమ తర్వాత వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్‍లో ఒకానొక బెస్ట్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ ప్రేమతో, అనూన్యంగా కనిపించే వారు. అయితే, అందరినీ షాక్‍కు గురి చేస్తూ 2021లో చైతన్య, సమంత విడిపోయారు. తాము విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత శోభితా దూళిపాళ్లతో చైతూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు వచ్చాయి. వారిద్దరూ కొన్ని ట్రిప్‍లకు కూడా కలిసే వెళ్లారనే సమాచారం బయటికి వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు నాగచైతన్య, శోభితా ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు.
చైతూ కంటే నాకే ముందు తెలుసు
చైతన్య కంటే ముందే తనకు శోభితా ధూళిపాళ్ల తెలుసని నాగార్జున వెల్లడించారు. గూఢచారి చిత్రంలో ఆమె నటన తనకు బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత కొన్ని విషయాలపై మాట్లాడామని అన్నారు. “చైతన్య కంటే శోభితా నాకు ముందు తెలుసంటే ఆశ్చర్యపోతారేమో. నాకు ఆరేళ్లుగా ఆమె తెలుసు. రెండేళ్ల క్రితమే చైతన్యకు శోభితా పరిచయం అయ్యారు. ముందుగా అడివి శేష్ గూఢచారి సినిమాలో శోభితాను చూశా. నాకు ఆమె నటన నచ్చింది. ఆ తర్వాత సినిమాలు, జీవితం, ఫిలాసఫీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. శోభితా చాలా విషయాలు తెలిసిన అమ్మాయి” అని నాగార్జున చెప్పారు.