Tillu Square: టిల్లు స్క్వేర్ కథ వేరేలా ఉంటుంది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్-siddu jonnalagadda about tillu square movie story in oh my lily song launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Siddu Jonnalagadda About Tillu Square Movie Story In Oh My Lily Song Launch Event

Tillu Square: టిల్లు స్క్వేర్ కథ వేరేలా ఉంటుంది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 19, 2024 06:23 AM IST

Siddu Jonnalagadda Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తోన్న సినిమా టిల్లు స్క్వేర్. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ఓ మై లిల్లీను లాంచ్ చేశారు. పాట లాంచ్ కార్యక్రమంలో టిల్లు స్క్వేర్ కథ గురించి సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టిల్లు స్క్వేర్ కథ వేరేలా ఉంటుంది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్
టిల్లు స్క్వేర్ కథ వేరేలా ఉంటుంది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Tillu Square Oh My Lilly Song: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ రానున్న విషయం తెలిసిందే.

టిల్లు స్క్వేర్‌లో బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సీక్వెల్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి టిల్లు స్క్వేర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. టిల్లు స్క్వేర్ నుంచి ఇప్పటికే విడుదలైన 'టికెటే కొనకుండా', 'రాధిక' పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి.

తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి 'ఓ మై లిల్లీ' అనే పాట విడుదలైంది. సోమవారం (మార్చి 18) సాయంత్రం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా టిల్లు స్క్వేర్ మూవీ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

"డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ, టిల్లు స్క్వేర్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ, కథ మాత్రం వేరేలా ఉంటుంది" అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు. ఈ ఈవెంట్‌లో మిగతా వారు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత, ఒత్తిడి ఉందని అర్థమైంది. మాకు ఒక మంచి టీం దొరికింది. అందరం కలిసి మంచి అవుట్ పుట్‌ని తీసుకొచ్చాము. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను" అని డైరెక్టర్ మల్లిక్ రామ్ తెలిపారు.

"నేను మొదటిసారి టిల్లు స్క్వేర్‌కి సంబంధించిన వేడుకలో పాల్గొన్నాను. మీ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఒక్క వేడుక కూడా మిస్ అవ్వను. మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. మార్చి 29న సినిమా విడుదలవుతోంది. ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, అచ్చు రాజమణి స్వరపరిచిన ఓ మై లిల్లీ మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది. గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు. సిద్ధు, రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు. ఇక లిరికల్ వీడియోలో సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

IPL_Entry_Point