Sharma And Ambani OTT: ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-sharma and ambani ott streaming on etv win and sharma and ambani trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharma And Ambani Ott: ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sharma And Ambani OTT: ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 05:54 AM IST

Sharma And Ambani OTT Streaming: ఓటీటీలోకి మరో సరికొత్త క్రైమ్ కామెడీ సినిమా శర్మ అండ్ అంబానీ రానుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. మరి ఈ శర్మ అండ్ అంబానీ సినిమా ఏ ఓటీటీలోకి రానుంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలు తెలుసుకుందాం.

ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ మూవీ.. డైరెక్ట్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? (Youtube)

Sharma And Ambani OTT Release: సాధారణంగా కామెడీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. ఇక వాటికి క్రైమ్ తోడైతే మరింత థ్రిల్లింగ్‌గా, ఆసక్తిగా ఉంటుంది. ఇలా ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్‌ను టచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు తాజాగా మరో క్రైమ్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఆ సినిమా పేరే శర్మ అండ్ అంబానీ.

లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ శర్మ అండ్ అంబానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయేందుకు రెడీ అవుతోంది. ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్.

ఈ ఈటీవీ విన్ యాప్‌లో శర్మ అండ్ అంబానీ మూవీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి మనమే రాజా అనే పాట విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌లో రిలీజైన ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా శర్మ అండ్ అంబానీ ట్రైలర్ (Sharma And Ambani Trailer) విడుదల చేశారు మేకర్స్.

శర్మ అండ్ అంబానీ ట్రైలర్‌పై లుక్కేస్తే.. శర్మతో పాటు అంబానీ అనే రెండు పాత్రల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్‌కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

మరొకపక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇక శర్మ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఇంకో మాటలో చెప్పాలంటే ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేసిందనే చెప్పాలి.

కాగా శర్మ అండ్ అంబానీ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీని అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ని కార్తీక్ సాయితో కలిసి భరత్ తిప్పిరెడ్డి సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్, హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

ఈ చిత్రానికి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్‌గా, శశాంక్ ఆలమూరు చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో అనేక విభిన్నమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ వచ్చిన హ్యాష్‌ట్యాగ్ 90స్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది.

ఇవే కాకుండా, ఈ మధ్య కాలంలో హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన వళరి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే అదృశ్యం అనే మరో మలయాళ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆకాశమే హద్దురా సినిమా ఫేమ్ అపర్ణ బాలమురళి కీ రోల్ ప్లే చేసింది.

 

Whats_app_banner