Top OTT Series: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు కామెడీ సిరీస్.. ఇండియాలోనే టాప్.. జూన్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3
India Top 3 OTT Web Series Save The Tigers 2: ఓటీటీలో పాపులర్ అండ్ సూపర్ హిట్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీరస్. ఇటీవల రిలీజైన సీజన్ 2 ఇండియాలోనే టాప్ 3 ప్లేస్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సీజన్ 3పై ఆసక్తికర ప్రకటన చేశారు మేకర్స్.
Save The Tigers 3 OTT Release: ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచింది. ఈ విజయం ఎంత పెద్దదిగా నిలిచిందంటే ఇండియాలో ఏ ఓటీటీలో మాధ్యమంలోనైనా టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ షో సత్తా చాటింది.
ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలిచింది. దీనిపై సేవ్ ది టైగర్స్ షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువైంది" అని మహి వి రాఘవ్ అన్నారు.
"కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని ఈ షో ద్వారా నమ్మకం కుదిరింది" అని డైరెక్టర్ అండ్ నిర్మాత మహి వి రాఘవ్ పేర్కొన్నారు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. అంతేకాకుండా సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం ఉందని నిరూపితమైంది. అందులో భాగంగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి.
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళుతుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వారి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి. రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే సదరు రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే సేవ్ ది టైగర్స్ సీజన్ 2కు రిలీజ్ సమయంలో సీజన్ 3కి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మహి వి రాఘవ్. మన జీవితాల్లో సరదాగా జరిగే సందర్భాలను, పాత్రల వారీగా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి ఈ సిరీస్ పుట్టిందన్నారు.
అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్‌కు, సీజన్ 2 తెరకెక్కించిన అరుణ్‌కు థ్యాంక్స్ చెప్పారు మహి వి రాఘవ్. ఈ సిరీస్‌ను రెండు సీజన్స్ మాత్రమే కాకుండా నాలుగైదు సీజన్స్ కూడా చేయొచ్చని, అవి బాగా వర్కౌట్ అయితే ఆ పాత్రలతో సినిమా కూడా చేయొచ్చని మహి వి రాఘవ్ అన్నారు.