Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?
Shaitaan OTT Streaming: హారర్ చిత్రాల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది సైతాన్. ఆర్ మాధవన్, అజయ్ దేవగన్, జ్యోతిక ముఖ్య పాత్రలుగా నటించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది. మరి సైతాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు చూస్తే..
Shaitaan OTT Release: అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ముగ్గురు కలిసి నటించిన సూపర్ నేచురల్ హారర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన కనబరిచి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో వచ్చిన గుజరాతీ హర్రర్ చిత్రం 'వాష్'కి రీమేక్.
పేరుకు రీమేక్ అయినప్పిటికీ నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా పూర్తి హారర్ అంశాలతో సైతాన్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రూ. 60 నుంచి 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 211.06 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
అంతేకాకుండా సినిమా విడుదలైన తొలి పది రోజుల్లోనే ఇండియాలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. వరల్డ్ వైడ్‌గా 211 కోట్ల వరకు కొల్లగొట్టిన సైతాన్ మూవీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ సినిమాగా అవతరించింది. అలాగే ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన రెండో హిందీ సినిమాగా రికార్డ్ అందుకుంది.
ఇంతటి భారీ విజయం అందుకున్న ఈ హారర్ మూవీ సైతాన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేయనుంది. సుమారు రెండు నెలల నిరీక్షణ తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది సైతాన్. ఈ సినిమాను మంచి ధర పెట్టి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది.
ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో అంటే మే 3 నుంచి సైతాన్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాను హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారా.. లేక తెలుగు వంటి ఇతర దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేస్తారనేది తెలియరాలేదు.
తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటే థియేటర్లో మిస్ అయిన తెలుగు ఆడియెన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో సైతాన్ చూసేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హిందీలో కూడా చూసి ఆనందించవచ్చు. ఇక సినిమా కథలోకి వెళితే.. ఒక సంతోషకరమైన కుటుంబంలో అనుకోని అతిథి వచ్చిన తర్వాతి సంఘటనలతో సాగుతుంది.
అపరిచితుడు వారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారి జీవితాలు ఎలా తలక్రిందులుగా మారుతాయి అనేది ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జియో స్టూడియోస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ పాఠక్ అండ్ అభిషేక్ పాఠక్ నిర్మించారు.
కాగా అజయ్ దేవగన్ చివరి సారిగా స్పోర్ట్స్ బయోపిక్ 'మైదాన్'లో కనిపించాడు. అమిత్ ఆర్ శర్మ దర్శకత్వం వహించిన 'మైదాన్' చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జాయ్ సేన్‌గుప్తా నిర్మించారు. అజయ్‌తో పాటు 'మైదాన్'లో ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్ కూడా నటించారు.
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో టబుతో కలిసి 'ఔరోన్ మే కహన్ దమ్ థా'లో కూడా నటించనున్నాడు. ఇది అజయ్, టబులకు జంటగా 10వ సినిమా కావడం విశేషం.