Maidaan OTT: అజయ్ దేవగన్ స్పోర్ట్స్ బయోపిక్ ‘మైదాన్’ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు.. ఆ తర్వాతే స్ట్రీమింగ్
Maidaan OTT Platfrom: మైదాన్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఖరారైంది. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతకు ముందే ఓటీటీ డీల్ జరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. వివరాలివే..
Maidaan OTT: భారత దిగ్గజ ఫుట్‍బాల్ కోచ్, హైదరాబాదీ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ మూవీ ‘మైదాన్’ వస్తోంది. ఈ చిత్రంలో హీరో అజయ్ దేవ్‍గన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియమణి కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఈ స్పోర్ట్స్ బయోపిక్ మూవీకి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. మైదాన్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఈద్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, ఈ తరుణంలో మూవీ ఓటీటీ డీల్ కుదిరింది.
ఓటీటీ పార్ట్‌నర్ ఇదే..
మైదాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది. ఈ చిత్రం రైట్స్ కోసం ప్రైమ్ వీడియో భారీగా చెల్లించిందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
సాధారణంగా బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం మైదాన్ మూవీ జూన్‍లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
పాజిటివ్ టాక్
మైదాన్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా కొందరు క్రిటిక్స్, సెలెబ్రిటీలకు ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్. ఈ చిత్రం చూసిన వారి దగ్గరి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మైదాన్ అద్భుతంగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్‍గా, ఎంగేజింగ్‍గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో మైదాన్ భారీ వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మైదాన్ సినిమాలో దిగ్గజ ఫుట్‍బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను అజయ్ దేవ్‍గన్ పోషించారు. ప్రియమణి, గజ్‍రాజ్ రావ్, దేవ్యాన్ష్ త్రిపాఠి, నితాన్షి గోయల్, ఆయేశా వింధారా, మీనల్ పటేల్, రుద్రాణి ఘోష్ కీలకపాత్రలు చేశారు. డైరెక్టర్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అబ్దుల్ రహీమ్ గురించి..
1951 నుంచి 1963 మధ్య భారత ఫుట్‍బాల్ జట్టుకు సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచ్‍గా, మేనేజర్‍గా వ్యవహరించారు. ఆయన కోచింగ్‍లో భారత జట్టు చాలా అద్భుతమైన విజయాలను సాధించింది. భారత ఫుట్‌బాల్ చరిత్రలో దాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు. కోచ్ రహీమ్ మార్శకత్వంలో 1951, 1962 ఆసియా గేమ్స్ టోర్నీల్లో బారత ఫుట్‍బాల్ జట్టు స్వర్ణపతకాలు సాధించింది. 1956 మెల్‍బోర్న్ ఒలింపిక్ క్రీడ్లలో సెమీఫైనల్ వరకు చేరింది. 1963లో కన్నుమూసే వరకు ఆయన భారత జట్టుకు కోచ్‍గా పనిచేశారు.
అంతటి ఘనతలు సాధించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంపై మైదాన్ చిత్రం వస్తోంది. దీంతో ఈ మూవీపై చాలా హైప్ ఉంది.
మైదాన్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఉంది. అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ హీరోలుగా నటించిన బడే మియా చోటే మియా చిత్రం కూడా ఏప్రిల్ 11వ తేదీనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.