Shaitaan Collection: రెండో రోజు అదరగొట్టిన హారర్ మూవీ సైతాన్.. 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!
Shaitaan Day 2 Box Office Collection: అజయ్ దేవగన్, జ్యోతిక, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో వికాస్ బహల్ దర్శకత్వంలో తెరకెక్కిన సైతాన్ మూవీ రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో ఇండియాలో సైతాన్‌కు వచ్చిన కలెక్షన్స్ ఎంతో చూస్తే..
Shaitaan 2 Days Collection: హిందీ స్టార్ హీరో అజయ్ దేవగన్, సౌత్ పాపులర్ హీరోయిన్ జ్యోతిక, వర్సటైల్ యాక్టర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్ (Shaitaan Movie). ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. శుక్రవారం (మార్చి 8) విడుదలైన సైతాన్ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగుంటున్నాయి. తొలి రోజు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ తెచ్చుకున్న సైతాన్ మూవీ రెండో రోజుకు మరింత పెంచుకుంది.
Sacnilk.com ట్రేడ్ సైట్ ప్రకారం సైతాన్ మూవీ భారత్‌లో రెండో రోజు రూ.18.25 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఇండియాలో రెండు రోజుల్లో సైతాన్ సినిమాకు రూ.33 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హిందీలో ఈ సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ 33.65 శాతంగా ఉంది. ఇక తొలి రోజు సైతాన్ సినిమాకు రూ. 14.50 కోట్లు వచ్చాయి. దీంతో బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హారర్ చిత్రాల్లో సైతాన్ ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
గతంలో హిందీ సినిమాల్లో అధిక వసూళ్లు రాబట్టిన హారర్ చిత్రంగా రాజ్ 3 ఉంది. 2012లో విడుదలైన ఈ సినిమా రూ. 10.33 కోట్లు రాబట్టింది. దాదాపు 12 ఏళ్ల రికార్డ్‌ను సైతాన్ మూవీ బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే సైతాన్ సినిమా 2023లో వచ్చిన గుజరాతీ హారర్ చిత్రం "వాష్" కు హిందీ రీమేక్. ఈ సినిమాకు కృష్ణదేవ్ యాగ్నిక్ రచన, దర్శకత్వం వహించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.
సైతాన్ సినిమాపై ట్విటర్‌లో నెటిజన్స్ పాజిటివ్‌గా రివ్యూస్ ఇచ్చారు. "అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ అద్భుతమైన నటనతో శక్తివంతమైన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. సినిమా మిమ్మల్ని కథలోకి లాగేస్తుంది. మీరు ఈ సినిమాటిక్ హర్రర్ మాస్టర్ పీస్‌ని కచ్చితంగా థియేటర్లలో చూడండి" ఒక వినియోగదారు రాసుకొచ్చాడు. "ఉద్రిక్తకరమైన, గ్రిప్పింగ్ సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ నిరాశపరిచింది" అని మరొకరు నెగెటివ్‌గా తెలిపారు.
అంతకుముందు, సైతాన్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తనకు ఇష్టమైన జానర్‌లలో హారర్, అతీంద్రియ శక్తులు వంటి కథలు ఇష్టమని చెప్పాడు. 2003లో "భూత్" సినిమా విజయం తర్వాత సైతాన్‌లో మళ్లీ నటించడం పట్ల చాలా థ్రిల్ ఫీలయినట్లు అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. "మనం (సూపర్ స్టార్లు) హారర్ చిత్రాలు చేయకూడదని కాదు. మనకు ఏదైనా ఆసక్తికరంగా అనిపిస్తే, ఎందుకు చేయకూడదు? నాకు ఈ జానర్ నచ్చి, దాన్ని మళ్లీ చేసేందుకు ఎదురు చూశాను. నేను భూత్ చేసిన తర్వాత మళ్లీ అలాంటి జోనర్‌లో నాకు మంచి స్క్రిప్ట్ రాలేదు" అని అజయ్ దేవగన్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, సైతాన్ సినిమాను అజయ్ దేవగన్ ఫిల్మ్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవగన్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. దీనికి మరో పార్టనర్‌గా జియో స్టూడియోస్ కూడా ఉంది.