RRR Korean Remake: కొరియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మానియా.. రీమేక్‌ కోసం భారీ ఆఫర్‌!-rrr korean remake to be made soon reveals producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Korean Remake: కొరియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మానియా.. రీమేక్‌ కోసం భారీ ఆఫర్‌!

RRR Korean Remake: కొరియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మానియా.. రీమేక్‌ కోసం భారీ ఆఫర్‌!

HT Telugu Desk HT Telugu

RRR Korean Remake: కొరియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మానియా కనిపిస్తోంది. ఈ సినిమాను కొరియాలో రీమేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం భారీ ఆఫర్‌ కూడా రావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ మూవీ (HT File Photo)

RRR Korean Remake: ప్రపంచమంతా కొరియా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వైపు చూస్తుంది. అక్కడి నుంచి వచ్చే కొత్త కాన్సెప్ట్‌లు గ్లోబల్ ఆడియెన్స్‌ను బాగా కనెక్టవుతున్నాయి. అయితే అలాంటి కొరియా కూడా ఇప్పుడు మన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వైపు చూస్తోంది. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర ఎంత సక్సెసైందో మనకు తెలిసిందే.

అన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ సంచలనాలు సృష్టించింది. హాలీవుడ్‌ ప్రముఖులను ఆకర్షించింది. ఇందులో ఎన్టీఆర్‌ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ ఫిదా అయిపోయారు. ఈ సినిమా హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు కూడా గెలుచుకుంది. అలాంటి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఇప్పుడు కొరియన్‌ మేకర్స్‌ కన్నేసినట్లు సమాచారం.

ఈ సినిమా త్వరలోనే కొరియాలో రీమేక్‌ కావచ్చని ట్రిపుల్‌ ఆర్‌ మూవీ ప్రొడ్యూసర్‌ సునిత చెప్పడం విశేషం. శాకిని డాకిని మూవీ ప్రమోషన్‌లో ఉన్న ఆమె.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ శాకిని డాకిని కూడా కామెడీ డ్రామా అయిన మిడ్‌నైట్‌ రన్నర్స్‌కు రీమేక్‌. అయితే ఇప్పుడు ఈ ఏటి మేటి మూవీ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ కొరియన్లకు బాగా నచ్చిందని, అందుకే దానిని రీమేక్‌ చేసే ఉద్దేశంతో ఉన్నారని సునిత వెల్లడించింది.

ఇప్పటికే కొరియన్‌ రీమేక్‌ కోసం తమకు ఆఫర్‌ కూడా వచ్చినట్లు తెలిపింది. అయితే దీనిపై రాజమౌళి రియాక్షన్‌ ఏంటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. "ప్రపంచమంతా కొరియన్‌ సినిమాల వైపు చూస్తుంటే.. కొరియన్లు మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ వెంట పడ్డారు. రీమేక్‌ హక్కుల కోసం కొరియన్ల నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది. ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్పినప్పుడు అతని రియాక్షన్‌ ఎలా ఉందన్నది మాత్రం నేను ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంచుతాను" అని సునిత అన్నది.

గత మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌, భీమ్‌గా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కనిపించారు. అజయ్‌ దేవ్‌గన్‌, ఆలియా భట్‌, శ్రియ శరణ్‌, ఒలివియా మోరిస్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. కీరవాణి అందించిన మ్యూజిక్‌ కూడా ఓ రేంజ్‌లో హిట్‌ అయిన విషయం తెలిసిందే.