OTT Sports Drama Movie: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Mr & Mrs Mahi OTT Streaming: మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
బాలీవుడ్ స్టార్లు రాజ్‍కుమార్ రావ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍తో వచ్చింది. ఈ మూవీ రిలీజ్‍కు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ఈ ఏడాది మే 31వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
స్ట్రీమింగ్ వివరాలు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (డూలై 26) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ వస్తుందా లేదా అనేది స్పష్టత రాలేదు. థియేటర్లలో హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ ప్రస్తుతానికి అదొక్క భాషలో వచ్చింది.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు ఎనిమిది వారాల తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా మోస్తరు కలెక్షన్లను సాధించింది.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. క్రికెట్ అంటే చాలా ప్యాషన్ ఉండే భార్యభర్తల స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. భార్యను క్రికెటర్ చేయాలని భర్త కష్టపడడం చుట్టూ కథ సాగుతుంది. ఈ చిత్రంలో రాజ్‍కుమార్ రావ్, జాన్వీ కపూర్‌తో పాటు రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా, పూర్ణేందు భట్టాచార్య, జరీనా వాహబ్, అర్జిత్ తనేజా కీలకపాత్రలు పోషించారు.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుమారు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. ఈ మూవీ సుమారు రూ.50కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
మిస్టర్ అండ్ మిసెస్ మహీ స్టోరీలైన్
భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కనే మహేంద్ర అగర్వాల్ (రాజ్‍కుమార్ రావ్) దాన్ని సాధించలేకపోతాడు. కుటుంబ వ్యాపారాన్ని నడపాలని తన తండ్రి ఒత్తిడి చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ అయిన మహిమ (జాన్వీ కపూర్)తో మహేంద్రకు వివాహం చేస్తారు. మహిమకు కూడా క్రికెట్ అంటే ఇష్టమని, బాగా ఆడగలదని మహేంద్ర గుర్తిస్తాడు. తన కలను మహిమ ద్వారా సాకారం చేసుకోవాలనుకుంటాడు. క్రికెట్‍లో మహిమకు ట్రైనింగ్ ఇస్తాడు. క్రికెట్ నేర్చుకునేందుకు మహిమ అంగీకరించిందా? భారత జట్టుకు ఆడిందా? వారి కల నెలవేరిందా? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
జాన్వీ లైనప్
జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఉల్జా మూవీ ఆగస్టు 2వ తేదీన రిలీజ్ కానుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీతో టాలీవుడ్‍లోకి జాన్వీ అడుగుపెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్న చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగానూ జాన్వీ నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.