Reliance Disney Merger: రిలయన్స్, డిస్నీ విలీనానికి ఒప్పందం ఖరారు.. జాయింట్ వెంచర్ విలువ సహా ముఖ్యమైన విషయాలు ఇవే
Reliance Disney Merger: రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనంలో ఒప్పందం పూర్తయింది. ఈ రెండు భారీ సంస్థలు మీడియా ఆపరేషన్లను విలీనం చేసేందుకు సంతకాలు చేశాయి. దీంతో ఇరు సంస్థల టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు ఒకే జాయింట్ వెంచర్ కిందికి రానున్నాయి.
Reliance Disney Merger: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, దిగ్గజ మీడియా సంస్థ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనానికి నేడు (ఫిబ్రవరి 28) ఒప్పందం జరిగింది. దేశ ఎంటర్‌టైన్‍మెంట్ రంగంలోనే ఇది అతిపెద్ద విలీనంగా ఉంది. ఇందులో భాగంగా రిలయన్స్‌కు చెందిన వియాకామ్ 18, స్టార్ ఇండియా టీవీ ఛానెళ్లు విలీనం కానున్నాయి. ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు జియోసినిమా, హాట్‍స్టార్ కూడా జాయింట్ వెంచర్‌లోనే ఉండనున్నాయి.
రూ.70వేల కోట్ల జాయింట్ వెంచర్
రిలయన్స్, డిస్నీ ఇండియా జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంది. జాయింట్ వెంచర్ అభివృద్ధి కోసం రూ.11,500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది. ఈ జాయింట్ వెంచర్ పూర్తయ్యాక రిలయన్స్ దీన్ని నియంత్రించనుంది. ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్‌కు 16.34 శాతం, రిలయన్స్ నేతృత్వంలోని వియాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం వాటా ఉండనున్నాయి. రెగ్యులేటరీలు, ఇన్వెస్టర్ల ఆమోదం లభించాక ఈ విలీన ప్రక్రియ పూర్తికానుంది.
రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ దిశగా ప్రక్రియ ముందుకు సాగింది. ఎట్టకేలకు నేడు ఈ విలీనం డీల్ జరిగింది. ఈ విషయంపై రిలయన్స్, వియాకామ్ 18, డిస్నీ అధికారికంగా ప్రకటించాయి.
చైర్‌పర్సన్‍గా నీతా అంబానీ
రిలయన్స్, డిస్నీ జాయింట్ వెంచర్‌కు చైర్‌పర్సన్‍గా ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యవహరించనున్నారు. వ్యూహాత్మక మార్గదర్శకం చేసే వైస్ చైర్‌పర్సన్‍గా ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో సంస్థలు పేర్కొన్నాయి.
100కు పైగా ఛానెళ్లు.. రెండు ఓటీటీలు
రిలయన్స్, డిస్నీ ఇండియా విలీనం కావడంతో వివిధ భాషలకు చెందిన 100కు పైగా టీవీ ఛానెళ్లు ఒకే గొడుగు కిందికి రానున్నాయి. డిస్నీ పరిధిలోని స్టార్ ఇండియా నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లు, వియాకామ్ 18 ఛానెళ్లు ఒకటి కానున్నాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లు జియో సినిమా, డిస్నీ+ హాట్‍స్టార్ కూడా ఈ జాయింట్ వెంచర్‌లో ఉంటాయి. డీల్ పూర్తయ్యాక రెండు ప్లాట్‍ఫామ్‍ల్లోనూ కంటెంట్‍ను ఒకే చోట యూజర్లు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
జాయింట్ వెంచర్‌లో భాగంగా ఓటీటీ బిజినెస్‍లోనే రూ.11,500 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ అంగీకరించింది. ఇప్పటికే జియోసినిమాతో ఓటీటీ రంగంలో టాప్‍లోకి వెళ్లాలని పట్టుదలగా ఉన్న రిలయన్స్.. ఈ ఒప్పందంతో దాన్ని సాకారం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. డిస్నీ+ హాట్‍స్టార్‌లో సుమారు 30,000 వేల కంటెంట్ వరకు ఉంది. ఈ డీల్ పూర్తయ్యాక ఇది రిలయన్స్ యాక్సెస్‍కు కూడా వస్తుంది.
అందుబాటు ధరల్లో కంటెంట్
రిలయన్స్ గ్రూప్‍ల్లో డిస్నీని ఆహ్వానిస్తున్నామని ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్, డిస్నీ మధ్య ఒప్పందం భారత ఎంటర్‌టైన్‍మెంట్ ఇండస్ట్రీలో కొత్త శకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మీడియా గ్రూప్‍గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్ నెలకొల్పడం చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే కంటెంట్‍ను అందించేందుకు ఈ జాయింట్ వెంచర్ ఉపయోగపడుతుందని రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ తెలిపారు.
టాపిక్