Reliance Q3 results: క్యూ 3 లో రిలయన్స్ నికర లాభాలు 17 వేల కోట్ల రూపాయలు..-reliance q3 results ril reports 9 3 percent rise in net profit to 17 265 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Q3 Results: క్యూ 3 లో రిలయన్స్ నికర లాభాలు 17 వేల కోట్ల రూపాయలు..

Reliance Q3 results: క్యూ 3 లో రిలయన్స్ నికర లాభాలు 17 వేల కోట్ల రూపాయలు..

HT Telugu Desk HT Telugu

Reliance Q3 results: రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 3 లో రిలయన్స్ రూ. 17,265 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

Reliance Q3 results: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో గ్రూప్ కంపెనీలకు చెందిన వివిధ కార్యకలాపాల ద్వారా కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,27,970 కోట్లుగా నమోదైంది.

ఆదాయం..

ఈ క్యూ 3 లో భారత్ కు చెందిన ఈ దిగ్గజ సంస్థ (Reliance Q3 results) స్థూల ఆదాయం 3.2 శాతం పెరిగి రూ.2,40,532 కోట్ల నుంచి రూ.248,160 కోట్లకు చేరుకుంది. ఈ క్యూ 3 లో సంస్థ ఈబీఐటీడీఏలో 16.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ వృద్ధిలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ల వాటానే అధికం. కంపెనీ డిప్రీసియేషన్ 26.7 శాతం పెరిగి రూ.12,903 కోట్లకు చేరుకుంది. అధిక రుణ నిల్వలు, వడ్డీ రేట్ల కారణంగా ఫైనాన్స్ వ్యయాలు 11.3 శాతం పెరిగి రూ.5,789 కోట్లకు చేరాయి.

మూల ధన వ్యయం

2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మొత్తం మూలధన వ్యయం రూ .30,102 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 5 జీ నెట్ వర్క్ ను ప్రారంభించడం, రిటైల్ మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త ఇంధన వ్యాపారంలో పెట్టుబడి.. మొదలైన వాటి వల్ల మూలధన వ్యయం పెరిగింది.

5 జీ నెట్ వర్క్ తో..

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో అత్యంత వేగంగా ట్రూ 5జీ సేవలను జియో పూర్తి చేసింది. దేశంలోని ప్రతి నగరం, పట్టణం, గ్రామం ఇప్పుడు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. ఇది రిలయన్స్ సాధించిన ఘనవిజయంగా భావించవచ్చు.

రిలయన్స్ జియో క్యూ3 ఫలితాలు

2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నికర లాభం 11.6 శాతం పెరిగి రూ.5,445 కోట్లకు చేరుకుంది. స్టాండలోన్ పరంగా చూస్తే రిలయన్స్ జియో నికర లాభం 3 శాతం పెరిగి రూ.5,208 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా జియో ఆదాయం రూ.24,892 కోట్ల నుంచి 11.3 శాతం పెరిగి రూ.27,697 కోట్లకు చేరింది. 5జీ నెట్ వర్క్ లో అపరిమిత డేటా ఇవ్వడం ద్వారా రిలయన్స్ జియో సబ్ స్క్రైబర్స్ ను భారీగా పెంచుకుంది. దాంతో జియో ఏఆర్ పీయూ 2 శాతం వృద్ధితో రూ.181.7 కు పెరిగింది.