Rachana Banerjee: బెంగాల్‍లో ఎంపీగా పోటీ చేస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్-rachana banerjee once tollywood heroine now lok sabha mp candidate for tcm ex cricketer yusuf pathan also contesting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rachana Banerjee: బెంగాల్‍లో ఎంపీగా పోటీ చేస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్

Rachana Banerjee: బెంగాల్‍లో ఎంపీగా పోటీ చేస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2024 10:10 PM IST

Rachana Banerjee: లోక్‍సభ ఎంపీగా పోటీకి బరిలోకి దిగుతున్నారు నటి రచనా బెనర్జీ. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్‍‍గా కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు బెంగాల్ నుంచి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు.

రచన బెనర్జీ
రచన బెనర్జీ

Rachana Banerjee: బెంగాలీ నటి రచన బెనర్జీ.. ఒకప్పుడు టాలీవుడ్‍లోనూ హీరోయిన్‍గా సినిమాలు చేశారు. బావగారు బాగున్నారా, పిల్ల నచ్చింది, మావిడాకులు, సుల్తాన్, లాహిరి లాహిరి లాహిరిలో సహా కొన్ని తెలుగు సినిమాల్లో రచన నటించారు. తన కెరీర్లో ఎక్కువగా బెంగాలీ, ఒడియా చిత్రాలు చేసిన ఆమె.. తమిళం, కన్నడలోనూ కొన్ని మూవీలు చేశారు. బెంగాలీ సీరియళ్లతో పాటు టీవీ రియాల్టీ షోలకు యాంకర్, జడ్జిగానూ వ్యవహరించారు. ఇప్పుడు, ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు రచన బెనర్జీ రెడీ అయ్యారు. లోక్‍సభ ఎంపీగా పోటీ చేయనున్నారు.

టీఎంసీ తరఫున..

పశ్చిమ బెంగాల్‍లోని హూగ్లీ లోక్‍సభ స్థానానికి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు నటి రచన బెనర్జీ. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. తొలిసారి ఆమె ఎంపీగా పోటీకి దిగుతున్నారు.

రాష్ట్రంలోని 14 లోక్‍సభ స్థానాలకు సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేడు (మార్చి 10) అభ్యర్థులను ప్రకటించింది. ఆ జాబితాలో రచన బెనర్జీ పేరు కూడా ఉంది. హూగ్లీ ఎంపీ సీటు ఆమెకు దక్కింది. దేశంలో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

దీదీ నంబర్ 1

తెలుగులో సుమారు పదిపైగా సినిమాల్లో రచన బెనర్జీ నటించారు. తెలుగులో చివరగా లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కనిపించారు. బెంగాలీలో 50కు పైగా సినిమాలు చేశారు. ఒడియాలోనూ చాలా చిత్రాల్లో నటించారు. బెంగాలీలో దీదీ నంబర్.1 గేమ్‍షోకు చాలా ఏళ్లపాటు యాంకర్‌గా రచనా బెనర్జీ వ్యవహరించారు. దీంతో ఇటీవల దీదీ నంబర్ వన్‍గా ఆమె బాగా పాపులర్ అయ్యారు.

యూసుఫ్ పఠాన్ కూడా..

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పాఠాన్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున బెంగాల్‍లోని బహరాంపూర్ లోక్‍సభ ఎంపీగా ఆయన పోటీ చేయనున్నారు. క్రికెటర్‌గా మంచి పాపులారిటీ ఉన్న పఠాన్‍కు టీఎంసీ సీటు ఇచ్చింది. ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. మరోసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది.

యూసుఫ్ పఠాన్ టీమిండియా తరఫున ఆల్ రౌండర్‍గా రాణించాడు. 2007 నుంచి 2012 మధ్య భారత్‍కు ఆడాడు. టీమిండియా తరఫున 57 వన్డేలు ఆడిన యూసుఫ్ 810 పరుగులు, 33 వికెట్లు పడగొట్టాడు. 22 అంతర్జాతీయ టీ20ల్లో 236 పరుగులు, 13 వికెట్లు తీశారు. 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‍కు యూసుఫ్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఐపీఎల్‍తో బెంగాల్‍కు కనెక్షన్

యూసుఫ్ పఠాన్‍ది గుజరాత్ రాష్ట్రం. అయితే, ఐపీఎల్‍లో అతడు కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తరఫున 2011 నుంచి 2017 వరకు ఆడాడు. చాలా మ్యాచ్‍ల్లో కేకేఆర్‌ను గెలిపించాడు. 2012, 2014 సీజన్లలో కోల్‍కతా టైటిల్ గెలువడంలో యూసుఫ్ కీలకపాత్ర పోషించాడు. దీంతో బెంగాల్‍లోనూ యూసుఫ్‍కు చాలా మంది అభిమానులు ఉన్నారు. దీంతో టీఎంసీ అతడికి సీటు కేటాయించింది. అయితే, రాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీతో పఠాన్ పోటీ పడాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner