Chiranjeevi: ఆ నిర్మాత అందరిలో నాపై గట్టిగా అరిచారు: మెగాస్టార్ చిరంజీవి-producer kranthi kumar insulted me during nyayam kavali movie says chirajeevi to vijay deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: ఆ నిర్మాత అందరిలో నాపై గట్టిగా అరిచారు: మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: ఆ నిర్మాత అందరిలో నాపై గట్టిగా అరిచారు: మెగాస్టార్ చిరంజీవి

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 31, 2024 11:03 PM IST

Megastar Chiranjeevi: ఓ ఈవెంట్‍లో హీరో విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి సమాధానాలు చెప్పారు. తన కెరీర్లో ఎదురైన ఓ అవమానాన్ని చిరూ వెల్లడించారు. ఆ అవమానం తనలో కసిని మరింత పెంచిందని వివరించారు.

Chiranjeevi: ఆ నిర్మాత అందరిలో నాపై గట్టిగా అరిచారు.. ఆ అవమానం నాలో కసిని పెంచింది: మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi: ఆ నిర్మాత అందరిలో నాపై గట్టిగా అరిచారు.. ఆ అవమానం నాలో కసిని పెంచింది: మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: తొలిసారి జరిగిన తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్‍కు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. నేడు (మార్చి 31) జరిగిన ఈ ఈవెంట్‍‍లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరూ పలు విషయాలపై ముచ్చటించారు. చిరంజీవిని చాలా ప్రశ్నలు అడిగారు విజయ్. ఈ సందర్భంగా తన కెరీర్లో ఎదురైన ఓ తీవ్రమైన అవమానం గురించి వెల్లడించారు మెగాస్టార్. ఆ అవమానంతో స్టార్ అవ్వాలన్న కసి తనలో మరింత పెరిగిందని చెప్పారు. ఆ వివరాలివే..

ఆ నిర్మాత నాపై అరిచారు

న్యాయం కావాలి (1981) సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ తనపై అకారణంగా అరిచారని హీరో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో అందరి మధ్య ఆయన అరిచేసరికి తనకు గుండె పిండేసినట్టయిందని చిరూ తెలిపారు.

సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ నిర్మాత క్రాంతి కుమార్ చేసిన అవమానం తనలో కసిని పెంచిందని చిరంజీవి చెప్పారు. సూపర్ స్టార్ అయి చూపిస్తానని అప్పుడు గట్టిగా అనుకున్నానని తెలిపారు.

‘పడి ఉండలేరా’ అని అన్నారు

తన కెరీర్లో తాను చాలా అవమానాలు, ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, వాటిని దాటుకుంటూ వచ్చానని చిరంజీవి తెలిపారు. అందుకు ఓ ఉదాహరణ ఆయన చెప్పారు. “న్యాయం కావాలి అనే సినిమా.. శారద చాలా గ్యాప్ తర్వాత ఆ చిత్రం చేశారు. డిఫెన్స్ లాయర్‌గా ఆ సినిమాలో నటించారు. నాా తరఫున లాయర్‌గా జగ్గయ్య ఉన్నారు. రాధిక కూడా ఉన్నారు. నిర్మాత క్రాంతి కుమార్ క్రేన్‍పై కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ మూడు, నాలుగు వందల మంది జూనియర్ అర్టిస్టులు ఉన్నారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను పిలిచాడు. ఆ తర్వాత నేను నా బోనులో నిల్చున్నా. అప్పుడు క్రాంతి కుమార్ నన్ను అందరి ముందు అరిచారు. ‘ఏంటండి మిమ్మల్ని కూడా పిలవాలా. వచ్చి ఇక్కడ పడి ఉండలేరా మీరు. ఎంటట.. సూపర్ స్టార్ అనుకుంటున్నారా మీరేమైనా.’ అని ఆయన నాపై అరిచారు. దీంతో నా గుండె పిండేసినట్టయింది” అని అప్పటి విషయాలను చిరంజీవి వివరించారు.

దీంతో తాను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదని అన్నారు. ఆ తర్వాత సాయంత్రం క్రాంతి కుమార్ తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చుకున్నారని చిరంజీవి తెలిపారు. శారదపై చిరాకును తనపై చూపించానని చెప్పారని చిరూ తెలిపారు. కానీ అది సరైన పద్ధతి కాదని, అంతమంది ముందు అంత అవమానానికి గురవడం చాలా బాధగా అనిపించిందని చిరూ అన్నారు.

‘సూపర్ స్టార్ అయి చూపిస్తా’ అనుకున్నా..

క్రాంతి కుమార్ అన్న మిగిలిన మాటలను వదిలేసినా.. ‘నువ్వు సూపర్ స్టార్ అనుకున్నావా’ అనే మాట తన మైండ్‍లో ఉండిపోయిందని చిరంజీవి చెప్పారు. ‘అవును.. అయి చూపిస్తా’ అనుకున్నానని, ఆ మాట తన మైండ్‍లో ఉండిపోయిందని తెలిపారు. ఆ అవమానంతో తనకు కసి పెరిగిందని తెలిపారు. ఆ అవమానాన్ని ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నానని, అలాంటివి చాలా జరిగాయని విజయ్‍కు చిరంజీవి తెలిపారు. అవమానాలను కూడా తాను అనుకూలతలుగా మార్చుకున్నానని, అందుకే తనకు ఎవరిపై ద్వేషం ఉండదని చిరంజీవి చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాగా ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

Whats_app_banner