Prabhas Spirit Budget: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మూవీకి అత్యంత భారీ బడ్జెట్.. ఆ రెండు సినిమాల తర్వాత ఇదే..
Prabhas Spirit Budget: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఆ రెండు సినిమాల తర్వాత మూడో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన మూవీగా నిలవనుంది.
Prabhas Spirit Budget: రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తర్వాత అతడు తీసిన సినిమాలన్నీ కొన్ని వందల కోట్ల బడ్జెట్ ఉన్నవే. అందులో అత్యధికంగా ఆదిపురుష్ ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ తీస్తున్న స్పిరిట్ మూవీకి కూడా అత్యంత భారీ బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
స్పిరిట్.. రూ.500 కోట్ల బడ్జెట్
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. ఈ సినిమాను ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టిన సందీప్ రెడ్డి.. ప్రభాస్ తో మూవీ తీయనుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ రూ.700 కోట్ల బడ్జెట్ తో టాప్ లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యే వచ్చి సంచలన విజయం సాధించిన కల్కి 2898 ఏడీ మూవీని కూడా రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్లో మూడో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ స్పిరిట్ నిలవనుంది.
ఈ మూవీని టీ-సిరీస్ తో కలిసి సందీపే నిర్మిస్తుండటం విశేషం. యానిమల్ మూవీకి కూడా అతడు కోప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పోలీసుగా కనిపించనుండగా.. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్.. భారీ బడ్జెట్ స్టార్
ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వసూళ్లు వాటంతట అవే వస్తాయని భావిస్తున్న నిర్మాతలు.. అతని సినిమాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడటం లేదు. ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2 మూవీస్ తర్వాత అతడు తీసిన సినిమాలన్నీ అలాంటివే.
ఈ రెండింటి తర్వాత వచ్చిన సాహో మూవీని ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.310 కోట్లు మాత్రమే వసూలు చేసి నిరాశ పరిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ మూవీని రూ.200 కోట్లతో తెరకెక్కించగా.. ఇది కూడా కేవలం రూ.104 కోట్లే వసూలు చేసింది. ఆదిపురుష్ ఏకంగా రూ.700 కోట్లతో తెరకెక్కిస్తే కేవలం రూ.300 కోట్లే రాబట్టింది.
ఇలా హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వచ్చిన సలార్ మూవీ మాత్రం రూ.270 కోట్లతో తెరకెక్కగా.. ఏకంగా రూ.600 కోట్లకుపైనే వసూలు చేసి ప్రభాస్ కు ఊరట కలిగించింది. ఇక కల్కి 2898 ఏడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఏకంగా రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసింది.
ఇవి కాకుండా ప్రభాస్ రాబోయే సినిమాల్లో ఒకటైన రాజా సాబ్ ను కూడా ఏకంగా రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక సలార్, కల్కి 2898 ఏడీ సీక్వెల్స్ బడ్జెట్ రూ.1000 కోట్లకుపైనే ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని పాన్ ఇండియా భారీ బడ్జెట్ స్టార్ అయిపోయాడు.