OTT Crime Documentaries: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్‌లు ఇవే.. మీరు ఎన్ని చూశారు?
OTT Crime Documentaries: ఓటీటీలు వచ్చిన తర్వాత నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి వాటిలో నిజ జీవితంలో జరిగిన క్రైమ్ లనే డాక్యుమెంటరీలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి బెస్ట్ డాక్యుమెంటరీస్ ఏవో మీరూ చూడండి.
OTT Crime Documentaries: ఓటీటీల్లో టాప్ మూవీస్, వెబ్ సిరీస్ లతోపాటు నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందే డాక్యుమెంటరీలు కూడా చాలానే ఉన్నాయి. అందులోనూ క్రైమ్ డాక్యుమెంటరీలకు కాస్త క్రేజ్ ఎక్కువే కదా. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లాంటి ఓటీటీలు తరచూ ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.
ఓటీటీల్లోని బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీలు ఇవే
నిజ జీవితంలో జరిగే నేరాల చుట్టూ ఎన్నో డాక్యుమెంటరీలను రూపొందించారు. సహజంగానే పేపర్లు, టీవీలు, వెబ్ సైట్లలోని క్రైమ్ న్యూస్ ఎలా ఆకర్షిస్తుందో ఈ డాక్యుమెంటరీలు కూడా అలాగే ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న డాక్యుమెంటరీల్లో 8 బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ - నెట్‌ఫ్లిక్స్
ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ ఇది. 2012లో ముంబైలో జరిగిన షీనా బోరా హత్య కేసు, ఇందులో ప్రధాన నిందితురాలు అయిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. 2015లో అరెస్ట్ అయి, 2022లో బెయిల్ పై రిలీజ్ అయిన ఇంద్రాణి వెర్షన్ కూడా ఇందులో చూడొచ్చు. ఈ కేసులోని ట్విస్టులను కళ్లకు కట్టిన ఈ డాక్యుమెంటరీని తప్పకుండా చూడండి.
డ్యాన్సింగ్ ఆన్ ద గ్రేవ్ - ప్రైమ్ వీడియో
1991లో సంచలనం రేపిన షకీరే ఖలీలి హత్య కేసుపై ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. చాలా రోజుల నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన షకీరే ఖలీలిని ఆమె రెండో భర్త హత్య చేశాడు.
ది తల్వార్స్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ - నెట్‌ఫ్లిక్స్
2008లో నోయిడాలో జరిగిన జంట హత్యల కేసు చుట్టూ తిరిగే డాక్యుమెంటరీ ఇది. ఆరుషి తల్వార్, వాళ్ల ఇంట్లో పని మనిషి హత్యకు గురి కావడం అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
కర్రీ అండ్ సయనైడ్: జాలీ జోసెఫ్ కేస్ - నెట్‌ఫ్లిక్స్
కొన్నేళ్ల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం, దాని వెనుక ఉన్నది ఆ ఇంట్లోని మహిళ జాలీ జోసెఫే అని తేలడం కేరళలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై నెట్‌ఫ్లిక్స్ కర్రీ అండ్ సయనైడ్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది.
ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ - నెట్‌ఫ్లిక్స్
నాగ్‌పూర్ లో ఉంటూ 40 మందికిపైగా మహిళలను రేప్ చేసిన భరత్ కాళీచరణ్ యాదవ్ అలియాస్ అక్కు యాదవ్ పై రూపొందించిన డాక్యుసిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
హౌజ్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్
2018లో ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడటం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. దీనిపై 2021లో నెట్‌ఫ్లిక్స్ హౌజ్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ పేరుతో డాక్యుసిరీస్ రూపొందించింది.