Mr Bachchan OTT Release Date: రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్!
Mr Bachchan OTT Release Date: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ నెల రోజుల్లోపే మూవీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది.
Mr Bachchan OTT Release Date: మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజైన సంగతి తెలుసు కదా. రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజైంది. అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్
హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. అందాల తార భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.33 కోట్లకు దక్కించుకుంది. సినిమా ఫ్లాపవడంతో నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ చేయాలని సదరు ఓటీటీ భావిస్తోంది.
సెప్టెంబర్ 12నే మిస్టర్ బచ్చన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ మూవీస్ డిజాస్టర్ తర్వాత మిస్టర్ బచ్చన్ పై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నా.. ఇది అంతకంటే పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
మిస్టర్ బచ్చన్ ఎలా ఉందంటే?
మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాకు రీమేక్. హిందీలో ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. తెలుగులో మాత్రం రవితేజ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
హిందీ రైడ్ మూవీ కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి లవ్ స్టోరీలు ఉండవు. సినిమా కథ చాలా వరకు ఒకే ఇంట్లో, సీరియస్ కోణంలో సాగుతుంది. ఇలాంటి కథను రీమేక్ చేయాలంటే చాలా ధైర్యమే కావాలి. మిస్టర్ బచ్చన్‌తో హరీష్ శంకర్ ఆ సాహసానికి సిద్ధపడ్డాడు.
రైడ్‌లోని మూలకథను తీసుకొని తనదైన స్టైల్ ట్రీట్‌మెంట్‌తో రవితేజ అభిమానులను మెప్పించేలా మిస్టర్ బచ్చన్ మూవీని రూపొందించాడు. కామెడీ, రొమాన్స్, లవ్ ట్రాక్ లను జోడించి ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా మూవీని మలిచాడు. రవితేజను నిజాయితీపరుడైన ఐటీ అధికారిగా చూపిస్తూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి.
అదే దెబ్బ కొట్టిందా?
మిస్టర్ బచ్చన్ మూవీలో కమర్షియాలిటీ కోసం దర్శకుడు చేసిన మార్పుల్లో కొన్ని బెడిసికొట్టినట్లుగా అనిపిస్తాయి. సీరియస్‌గా కథను నడిపించాల్సిన చోట కామెడీని ఇరికించి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని డైరెక్టర్ అనుకోవడం అంతగా ఆకట్టుకోడు. కీలకమైన చమ్మక్ చంద్ర ట్రాక్ నవ్వించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ కథకు సంబంధం లేకుండా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీలో హిందీ పాటలు ఎక్కువ కావడం మరో డ్రాబ్యాక్‌గా నిలిచింది.
బచ్చన్ పాత్రలో రవితేజ తనదైన మార్కు ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ఒరిజినల్‌లో అజయ్ దేవ్‌గన్ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేకుండా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. యాక్టింగ్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినా రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది.