Ravi Teja Surgery: సర్జరీపై అప్‍డేట్ ఇచ్చిన హీరో రవితేజ.. ట్వీట్ చేసిన మాస్ మహారాజా
Ravi Teja Surgery Update: హీరో రవితేజకు శస్త్రచికిత్స జరిగింది. షూటింగ్‍లో గాయపడటంతో సర్జరీ అవసరమైంది. ఈ విషయంపై ఆయనే స్వయంగా అప్‍డేట్ ఇచ్చారు. నేడు (ఆగస్టు 24) ట్వీట్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లలో నిరాశపరిచింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తదుపరి భాను భోగవరపు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు రవితేజ. ఇది ఆయనకు 75వ చిత్రంగా (RT75) ఉంది. కాగా, ఈ సినిమా షూటింగ్‍లో గాయపడిన రవితేజకు సర్జరీ జరిగింది. ఈ విషయంపై ఆయన నేడు (ఆగస్టు 24) అప్‍డేట్ ఇచ్చారు.
డిశ్చార్జ్ అయ్యా.. బాగున్నా
తనకు సర్జరీ జరిగిందని, డిశ్చార్జ్ అయ్యానని రవితేజ నేడు ట్వీట్ చేశారు. మళ్లీ షూటింగ్‍లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ తెలిపారు. “సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యా. అందరి ఆశీర్వాదాలు, మద్దతుకు కృతజ్ఞుడిని. మళ్లీ సెట్స్‌లోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నా” అని రవితేజ పోస్ట్ చేశారు.
ఆరు వారాల విశ్రాంతి!
హైదరాబాద్‍లో జరుగుతున్న షూటింగ్‍లో రవితేజ చేతికి గాయమైంది. దీంతో ఆయనను యశోద ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సర్జరీ చేశారు. దీంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానంటూ నేడు ట్వీట్ చేశారు రవితేజ.
ఆర్‌టీ175 గురించి..
భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఈ మూవీ చేస్తున్నారు. మాస్ మహారాజాకు 75వ సినిమా కావడంతో ఆర్‌టీ175గా ఈ ప్రాజెక్టును పిలుస్తున్నారు. త్వరలో టైటిల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. గతేడాది సూపర్ హిట్ అయిన సామజవరగమన చిత్రానికి భాను కథను అందించారు. ఈ మూవీతో బాగా పాపులర్ అయ్యారు. అయితే, రవితేజతో చిత్రంతోనే దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
రవితేజ - శ్రీలీల కాంబో రిపీట్
రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‍లో 2022లో వచ్చిన ధమాకా సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇప్పుడు ఆర్‌టీ175లో ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
వరుస ప్లాఫ్‍లు
ధమాకా తర్వాత రవితేజకు ఆ రేంజ్‍లో హిట్ పడలేదు. గతేడాది రావణాసుర చిత్రం నిరాశపరిచింది. రవితేజ యాక్టింగ్ అదిరిపోయినా.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా బోల్తా కొట్టింది. ఈ ఏడారి రిలీజైన ఈగల్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది.
ఈనెల ఆగస్టు 15వ తేదీన వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్‍తో వసూళ్లను అనుకున్న విధంగా రాబట్టలేకపోయింది. రన్‍టైమ్ ట్రిమ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చాలా అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆర్‌టీ175తో మళ్లీ రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.