Raviteja Injury: రవితేజకు సర్జరీ - ఆరు వారాలు షూటింగ్‌లకు బ్రేక్
Raviteja Injury: కొత్త సినిమా షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ గాయపడ్డట్టు తెలిసింది. రవితేజకు డాక్టర్లు సర్జరీ చేసినట్లు సమాచారం. గాయం కారణంగా రవితేజ ఆరు వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Raviteja Injury: టాలీవుడ్ హీరో రవితేజ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. రవితేజ కుడి చేతికి గాయం కావడంతో గురువారం డాక్టర్లు సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆరు వారాల పాటు షూటింగ్‌లకు రవితేజ దూరంగా ఉండనున్నాడు.
75వ సినిమా...
మిస్టర్ బచ్చన్ తర్వాత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ ఓ సినిమా చేస్తోన్నాడు. రవితేజ కెరీర్‌లో 75వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
హైదరాబాద్‌లో షూటింగ్...
ఆర్‌టీ 75 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో రవితేజ గాయపడు. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోండగా రవితేజ కుడి చేతి కండరం చిట్లిపోయి గాయపడ్డట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఆ గాయాన్ని లెక్కచేయకుండా రవితేజ షూటింగ్‌ను కొనసాగించాడట. దాంతో గాయం తీవ్రత ఎక్కువైనట్లు మేకర్స్ వెల్లడించారు.
గురువారం యశోద హాస్పిటల్ డాక్టర్లు రవితేజకు సర్జరీని నిర్వహించినట్లు తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు తెలిసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటివరకు రవితేజ షూటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
ధమాకా జోడి...
మాస్ యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది. దర్శకుడిగా భాను భోగవరపుకు ఇదే మొదటి మూవీ. గతంలో చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్యకు భాను భోగవరపు డైలాగ్స్ అందించాడు. సామజవరగమనా సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. రవితేజ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తోంది.
మిస్టర్ బచ్చన్ డిజాస్టర్...
ఇటీవలే ఇండిపెండెన్స్ డే కానుకగా మిస్టర్ బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఎనిమిది కోట్లలోపు వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్‌గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. మిస్టర్ బచ్చన్ కంటే ముందే రిలీజైన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు కూడా రవితేజనకు నిరాశనే మిగిల్చాయి.