2 Years for RRR: ప్రపంచాన్ని ఊపేసిన ‘ఆర్ఆర్ఆర్’కు రెండేళ్లు.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్: ఈ సినిమా విశేషాలివే..-most popular indian film rrr completes 2 years movie team shares jr ntr ram charan new poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Most Popular Indian Film Rrr Completes 2 Years Movie Team Shares Jr Ntr Ram Charan New Poster

2 Years for RRR: ప్రపంచాన్ని ఊపేసిన ‘ఆర్ఆర్ఆర్’కు రెండేళ్లు.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్: ఈ సినిమా విశేషాలివే..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 25, 2024 04:55 PM IST

2 Years for RRR - Jr NTR - Ram Charan: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. ఈ తరుణంలో మూవీ టీమ్ ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది.

2 Years for RRR: ప్రపంచాన్ని ఊపేసిన ‘ఆర్ఆర్ఆర్’కు రెండేళ్లు.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్: ఈ సినిమా విశేషాలివే..
2 Years for RRR: ప్రపంచాన్ని ఊపేసిన ‘ఆర్ఆర్ఆర్’కు రెండేళ్లు.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్: ఈ సినిమా విశేషాలివే..

2 Years for RRR: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచమంతా భారతీయ సినీ ఇండస్ట్రీ వైపు తిరిగిచూసింది. తెలుగు పరిశ్రమలో రూపొందిన ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ చిత్రం కమర్షియల్‍గా భారీ విజయం సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్‍బర్గ్ సహా అనేక మంది మహామహులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి టేకింగ్, విజన్‍కు సలాం కొట్టారు. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆస్కార్ వేదికపై కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. అంతటి ఘనతలు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి నేటికి (మార్చి 25) రెండేళ్లయింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 మార్చి 25వ తేదీన రిలీజ్ అయింది. తెలుగు, హిందీతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో భారీ బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అదరగొట్టింది. గ్లోబల్ ప్రేక్షకులు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ చిత్రం వచ్చి రెండేళ్లవుతున్నా.. జపాన్ సహా కొన్ని దేశాల్లో ఇప్పటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. రెండేళ్లయినా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

రెండు తుఫాన్లు అంటూ..

ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న పోస్టర్ ట్వీట్ చేసింది. రామ్‍, భీమ్‍గా ఆ చిత్రంలో ఇద్దరూ నవ్వుతూ ముచ్చటించుకుంటున్న ఫొటోను వెల్లడించింది. “2 సంవత్సరాలు.. 2 తుఫాన్లు.. ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని ఊపేశారు” అంటూ రాసుకొచ్చింది.

ఇంట్రడక్షన్స్.. ఇంటర్వెల్.. ఎలివేషన్స్

ఆర్ఆర్ఆర్ సినిమాలో జంతువులతో రాజమౌళి తెరకెక్కించిన ఇంటర్వెల్.. సినీ చరిత్రలోనే ఒకానొక బెస్ట్ సీక్వెన్సుగా నిలిచిపోయింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో చాలా మంది సోషల్ మీడియాలో దీన్ని గుర్తు చేసుకుంటున్నారు. రామ్‍చరణ్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్.. రాజమౌళి టేకింగ్‍ను మరోసారి ప్రశంసిస్తున్నారు. ఇక, ఈ మూవీలో బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ రామ్‍గా రామ్‍చరణ్, భీమ్‍గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్లు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నిలిచిపోయాయి. ఈ సినిమాలోని ఎలివేషన్లు ప్రేక్షకులకు గూజ్‍బంప్స్ తెప్పించాయి. నిప్పు, నీరు కాన్సెప్ట్ కూడా అబ్బుపరిచింది.

సోషల్ మీడియాలో మోత

ఆర్ఆర్ఆర్ చిత్రానికి రెండేళ్లు పూర్తవడంతో సోషల్ మీడియాలో మోతెక్కిపోతోంది. #RRR హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ట్వీట్లు భారీ సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో తమకు నచ్చిన సీన్లను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ.. మూవీ టీమ్‍ను ప్రశంసిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‍చరణ్, ఎన్టీఆర్‌తో పాటు ఆలియాభట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‍గన్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,380కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఆస్కార్‌తో చరిత్ర

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫీచర్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. ఈపాటకు గాను మ్యూజిక్ డైరెక్టర్ ఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. 2024 ఆస్కార్ వేడుకలోనూ ఆర్ఆర్ఆర్ ప్రస్తావన వచ్చింది.

IPL_Entry_Point