SSMB 29: మహేశ్ - రాజమౌళి సినిమాలో ఇండోనేసియా నటి! ఎవరు ఈమె..-ssmb29 updates chelsea elizabeth islan reportedly to play key role in mahesh babu ss rajamouli action movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb 29: మహేశ్ - రాజమౌళి సినిమాలో ఇండోనేసియా నటి! ఎవరు ఈమె..

SSMB 29: మహేశ్ - రాజమౌళి సినిమాలో ఇండోనేసియా నటి! ఎవరు ఈమె..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 11, 2024 02:15 PM IST

Mahesh Babu - SS Rajamouli SSMB 29: మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందనున్న మూవీ గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది. ఇండోనేషియా స్టార్ నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ ఈ చిత్రం నటించనున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరంటే..

మహేశ్ బాబు - చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్
మహేశ్ బాబు - చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‍లో గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ (SSMB 29) రూపొందనుంది. హాలీవుడ్ రేంజ్‍లో అత్యంత భారీగా ఈ చిత్రం ఉండనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి చాలా పాపులర్ అయ్యారు. చాలా మంది దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు ఆయనను ప్రశంసించారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రంపై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో మహేశ్ - రాజమౌళి సినిమాలో ఓ విదేశీ నటి కీలకపాత్ర చేయనున్నారని సమాచారం బయటికి వచ్చింది.

మహేశ్‍తో మూవీని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారని, అందుకే విదేశీ నటులు ఈ చిత్రం ఉంటారని అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టే, ఇండోనేషియాకు చెందిన ప్రముఖ నటి ‘చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ను ఈ సినిమా కోసం రాజమౌళి ఎంపిక చేశారని సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం.

ఎవరీ చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్

అమెరికాలో పుట్టిన ‘చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ ఇండోనేషియా సినిమాల్లో స్టార్‌గా ఎదిగారు. డి బాలిక్, రూడి హబిబీ, ఏ కాపీ ఆఫ్ మైండ్, మే ది డెవిల్ టేక్ యూ లాంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు. మంచి టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్నారు ఈ 28 ఏళ్ల అందాల భామ. మహేశ్‍తో సినిమాకు చెల్సీ ఎలిజబెత్‍ను రాజమౌళి ఎంపిక చేశారని ఇప్పుడు రూమర్లు బయటికి వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ప్రకటన అప్పుడే!

మహేశ్ బాబుకు 29వ సినిమా కావటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును SSMB29గా పిలుస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‍లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, షూటింగ్‍కు ముందే దర్శకుడు రాజమౌళి ఓ ప్రెస్‍మీట్ నిర్వహించి.. సినిమా గురించిన వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలోనే ‘చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి, ఈ చిత్రంలో మహేశ్‍ సరసన ఆమె హీరోయిన్‍గా నటిస్తారా.. లేకపోతే వేరే కీలకపాత్ర పోషిస్తారా అనేది చూడాలి.

మహేశ్ న్యూలుక్

రాజమౌళితో చేసే మూవీ కోసం మహేశ్ బాబు కొత్త లుక్‍లో కనిపించనున్నారని తెలుస్తోంది. గడ్డంతో లాంగ్ హెయిర్ గెటప్‍లో ఆయన ఉంటారని టాక్. ఇటీవల బయటికి వచ్చిన కొన్ని ఫొటోలతో ఈ విషయం తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ మేకోవర్ కొత్తగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. షూటింగ్‍ ప్రారంభానికి ముందే వర్క్ షాప్‍లను కూడా చేసే పనిలో ఉన్నారట రాజమౌళి.

ఈ చిత్రం కోసం ఫిజికల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ కోసం ఇటీవలే జర్మనీకి వెళ్లి వచ్చారు మహేశ్ బాబు. ఈ సినిమాకు ఏకంగా రెండు సంవత్సరాలను ఆయన కేటాయించనున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో రూపొందే ఈ మూవీ బడ్జెట్ రూ.1,000 కోట్ల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 2026 చివర్లో లేకపోతే.. 2027 మొదట్లో ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

Whats_app_banner