Spielberg Likes RRR: ఆర్ఆర్ఆర్‌ను మెచ్చిన హాలీవుడ్ దిగ్గజం.. రాజమౌళిపై ప్రశంసల వర్షం-steven spielberg loved rrr praises rajamouli and his team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Spielberg Likes Rrr: ఆర్ఆర్ఆర్‌ను మెచ్చిన హాలీవుడ్ దిగ్గజం.. రాజమౌళిపై ప్రశంసల వర్షం

Spielberg Likes RRR: ఆర్ఆర్ఆర్‌ను మెచ్చిన హాలీవుడ్ దిగ్గజం.. రాజమౌళిపై ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:26 PM IST

Spielberg Likes RRR: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అద్భుతంగా ఉందని తెలిపారు. ఆయన తెరకెక్కించి ది ఫ్యాబుల్ మ్యాన్స్ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళితో వీడియోలో మాట్లాడారు.

రాజమౌళితో స్పీల్ బర్గ్
రాజమౌళితో స్పీల్ బర్గ్

Spielberg Likes RRR: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌ను టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత నెలలో కలిసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా స్పీల్ బర్గ్‌తో మన జక్కన్న కాసేపు ముచ్చటించారు. అయితే నెల వ్యవధిలో మరోసారి హాలీవుడ్‌ డైరెక్టర్‌తో సంభాషించారు. ఈ సారి ప్రత్యక్షంగా కాకుండా.. పరోక్షంగా వీడియో రూపంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. స్పీల్ బర్గ్ తెరకెక్కించిన ది ఫ్యాబుల్ మ్యాన్స్ ప్రమోషన్లలో భాగంగా స్పీల్ బర్గ్‌తో రాజమౌళి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిక విషయాలను వీరిద్దరూ పంచుకున్నారు. అంతేకాకుండా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు.

"ఆర్ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. నేను చూసేది నిజమేనా అని కళ్లను నమ్మలేకపోయాను. రామ(జూనియర్ ఎన్టీఆర్), రామ్(రామ్ చరణ్), ఆలియా నటన బాగుంది. నా ఇండియానా జోన్స్‌లో నటించిన అలీసన్ డూడీ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ప్రతినాయకురాలిగా నటించిన ఆమె పాత్రను బాగా ముగించారు.విజువల్‌గా ఎంతో అందంగా ఉంది. ఆర్ఆర్ఆర్‌కు అభినందనలు తెలుపుతున్నాను." అని స్పీల్ బర్గ్ అన్నారు.

ఇందుకు రాజమౌళి కూడా స్పందిస్తూ "థ్యాంక్యూ వెరీ మచ్ సార్. మీ అభినందనలకు నేను కుర్చీలో నుంచి లేచి డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సంభాషణ నాకెంతో ప్రత్యేకం" అని రాజమౌళి స్పష్టం చేశారు.

ఆస్కార్ డ్రీమ్‌ను అందుకోవాలంటే భారతీయ దర్శకులు అనుసరించాల్సిన విధానాన్ని కూడా స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను అడిగారు రాజమౌళి. ఇందుకు స్పీల్ బర్గ్ బదులిస్తూ.. ప్రత్యేకంగా వేరే దేశం, వేరే సంస్కృతి నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా భిన్నంగా ఏం చేయాలో సలహా ఇవ్వకూడదని అనుకున్నట్లు పేర్కొన్నారు. "నేను ఏం చెప్తానంటే మీ సొంత కథలను చెప్పండి.. మీ కథలను ప్రపంచం వినాలని మీరు భావించి వాటికి అనుగుణంగా ప్రయత్నించవద్దు. అప్పుడు మీరు ప్రపంచం కోసం పనిచేస్తున్నట్లవుతుంది. మీ కోసం పనిచేయడం లేదని తెలుస్తుంది. మీ హృదయం ఏం చెబితే ఆ కథలను చెప్పండి. అది మీ కెరీర్‌లో గుర్తింపును తీసుకొస్తుంది." అని స్పీల్ బర్గ్ రాజమౌళి సలహా ఇచ్చారు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేటైంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం