Mahesh Babu: మహేష్ బాబుకి అచ్చిరాని మదర్ సెంటిమెంట్? పదేళ్ల తర్వాత కూడా ఇలా!
Mahesh Babu Mother Sentiment Movies: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ఆ ఒక్క సెంటిమెంట్‌తో ఫ్లాప్స్ చవిచూశాడు. అవేంటో లుక్కేద్దాం.
Mahesh Babu Flop Movies: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా, నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టి అమ్మాయిలకే కాదు టాలీవుడ్ ప్రిన్స్‌గా పేరు తెచ్చుకున్నాడు. అనంతరం తన నటన, డ్యాన్స్, కామెడీ టైమింగ్‌తో సూపర్ స్టార్‌గా తన స్టార్‌డమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న మహేష్ బాబుకు ఫ్లాప్స్ ఇచ్చిన మదర్ సెంటిమెంట్ మూవీస్ ఏంటో చూద్దాం.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో చాలా నిరాశ పరిచిన చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక సినిమా పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ అని ప్రచారం జరగడం, టైటిల్ గుంటూరు కారం అని ఉండటంతో మాస్ ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఊహించని టాక్ తెచ్చుకుంది.
వర్కౌట్ కాని కాన్సెప్ట్
జనవరి 12న సంక్రాతికి విడుదలైన గుంటూరు కారం మూవీ తెలుగు ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. అయితే అందుకు కారణం మెయిన్ కాన్సెప్ట్‌గా తీసుకున్న మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడమే. తల్లితో ఎలాంటి సంబంధం లేదని కొడుకు పెట్టే ఒక సంతకం చుట్టూ కథంతా తిరుగుతుంది. అయితే, దానికి తగిన సీన్స్ లేకపోవడం, త్రివిక్రమ్ రచనలో ఉండే బలం, పవర్ ఈ సినిమాలో కొరవడిందనేది బాగా వినిపించిన టాక్. ఇలా అనేక కారణాలతో గుంటూరు కారం మహేష్ బాబుకు దాదాపుగా ఫ్లాప్‌నే మిగిల్చింది.
నాని
వెర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా నాని. సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన నాని సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్‌తోనే ఉంటుంది. ఎనిమిదేళ్ల వయసులో తల్లికి తనంటే ఇష్టం లేదని చనిపోదామనుకున్న కుర్రాడికి ఓ సైంటిస్ట్ ప్రయోగంతో 28 ఏళ్ల వాడిగా మారిపోతాడు. తర్వాత అది ఆ ప్రయోగం ఫెయిల్ అయి పగలు 8 ఏళ్ల పిల్లాడిలా, రాత్రి 28 ఏళ్ల యువకుడిగా ఉంటాడు.
ఈ క్రమంలోనే తన తల్లి తనపై ఎందుకు అరిచింది. ఎందుకు కోప్పడిందో తెలుసుకోవడం. భార్య ప్రెగ్నెంట్ కావడం ద్వారా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, కొన్ని సీన్ల వరకు బాగానే ఉన్నా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి కామెడీ రోల్‌లో మహేష్ బాబును అభిమానులు, ప్రేక్షకులు చూడలేకపోయారు. దీంతో సుమారుగా రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన నాని సినిమా యావరేజ్‌గా నిలిచింది.
నిజం
మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్ట్ చేసిన సినిమా నిజం. 2003లో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్‌గా మెప్పించాడు. అయితే, తన తండ్రిని చంపినందుకు పగ తీసుకునే రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కిన నిజం సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొడుకుకి తల్లి ట్రైనింగ్ ఇచ్చి మరి పగ తీర్చుకునేందుకు రెడీ చేస్తుంది. ఒక్కడు వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబును ఇలాంటి పాత్రలో చూడటం బాక్సాఫీస్‌కు నచ్చలేదు. దాంతో అది డిజాస్టర్‌గా నిలిచింది. అంటే ఒకరకంగా మదర్ సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా కూడా మహేష్ బాబుకు ప్లాప్ మిగిల్చింది.
మరికొన్ని సినిమాలు
మదర్ సెంటిమెంట్ సినిమాలే కాకుండా చెల్లెలి సెంటిమెంట్ ఉన్న అర్జున్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయితే, ఇలా ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో మహేష్ బాబు హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా.. మురారి వంటి కొన్ని సినిమాలు మాత్రం హిట్ ఇచ్చాయి. దాదాపు పదేళ్ల తర్వాత మదర్ సెంటిమెంట్ తో వచ్చిన గుంటూరు కారం నిరాశపరచడంతో మహేష్ బాబు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది.
టాపిక్