Saripodhaa Sanivaaram Glimpse: నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య డైలాగ్ హైలెట్-saripodhaa sanivaaram glimpse released on nani birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Glimpse: నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య డైలాగ్ హైలెట్

Saripodhaa Sanivaaram Glimpse: నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య డైలాగ్ హైలెట్

Sanjiv Kumar HT Telugu
Feb 24, 2024 01:10 PM IST

Nani Saripodhaa Sanivaaram Glimpse Out: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా గ్లింప్స్‌ చివరిలో ఎస్‌జే సూర్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య డైలాగ్ హైలెట్
నాని సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య డైలాగ్ హైలెట్

Nani Birthday Special: నేచురల్ స్టార్ నాని వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఇటీవలే దసరా, హాయ్ నాని వంటి రెండు డిఫరెంట్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నాని ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ఇదివరకు నానితో అంటే సుందరానికి తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి హై బడ్జెట్‌‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శనివారం అంటే ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించాడు. అలాగే తమిళ వెర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. "కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలాగా ఉంటుంది" అంటూ ఎస్‌జే సూర్య వాయిస్‌ ఓవర్‌తో సరిపోదా శనివారం గ్లింప్స్ వీడియోను ప్రారంభించారు.

సరిపోదా శనివారం సినిమాలో నాని విపరీతమైన కోపం ఉన్న సూర్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆ కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం శనివారం మాత్రమే చూపించాలని అనుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సరిపోదా శనివారం తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇక గ్లింప్స్‌లో ఫోకస్ అంతా నానిపైనే ఉంచారు. నాని లుక్, స్టైల్, స్వాగ్ బాగుంది. ఇక చివరిలో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఎస్‌జే సూర్య చెప్పి భయంకరంగా నవ్వే సీన్ అదిరిపోయింది.

ఆ సమయంలో పోలీస్ లాకప్‌లో చుట్టూ రౌడీలు, రక్తం మరకలతో పోలీస్ యూనిఫామ్‌లో ఎస్‌జే సూర్య అలా డైలాగ్ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఇక హ్యాపీ శనివారం అంటూ గ్లింప్స్ పూర్తి చేశారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇదే గ్లింప్స్ వీడియోలో ప్రకటించారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న సరిపోదా శనివారం మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాతో నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సరిపోదా శనివారంలో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. కాగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్‌గా ఉండనుందన మేకర్స్ తెలిపారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు.