Dev Gill: హీరోగా మగధీర విలన్.. విక్రమార్కుడు రేంజ్‌లో అహో విక్రమార్క.. రాజమౌళి భార్యపై కామెంట్స్
Magadheera Villain Dev Gill Aho Vikramarka Teaser Out: రామ్ చరణ్ మగధీర సినిమాలో విలన్‌గా చేసిన దేవ్ గిల్ హీరోగా నటించిన సినిమా అహో విక్రమార్క. తాజాగా అహో విక్రమార్క టీజర్ రిలీజ్ చేశారు. రవితేజ విక్రమార్కుడు సినిమా తరహాలో ఇందులో దేవ్ గిల్ పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించినట్లు తెలుస్తోంది.
Dev Gill Aho Vikramarka Teaser Release: బ్లాక్‌బస్టర్ 'మగధీర' సినిమాతో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి 'అహో! విక్రమార్క' అనే మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
పేట త్రికోటి దర్శకత్వం వహించిన అహో విక్రమార్క సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. "ఇది అసుర రాజ్యం. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్పా.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు" అనే డైలాగ్‌తో అహో విక్రమార్క టీజర్ స్టార్ట్ అయింది. ఇందులో దేవ్ గిల్ పవర్ ఫుల్ పోలీస్‌గా ఆకట్టుకున్నాడు. "పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు" అనే డైలాగ్‌తో సినిమా క్యాపబిలిటీ ఏంటో చూపించారు.
టీజర్ చూస్తుంటే రవితేజ విక్రమార్కుడు రేంజ్‌లో దేవ్ గిల్ అహో విక్రమార్క ఉన్నట్లుగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే, అహో విక్రమార్క టీజర్ రిలీజ్ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవ్ గిల్‌తో పాటు ఆయన భార్య, నిర్మాత ఆర్తి, ఇతర టెక్నీషియన్స్ తమ భావాలను పంచుకున్నారు.
"మగధీర నుంచి నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూణెలో మా తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉండొచ్చు.. కానీ హైదరాబాద్‌లో రాజమౌళి గారు నాకు పేరు ఇచ్చారు. రమా గారు నాకు తల్లిలా సపోర్ట్ ఇచ్చారు. వారి వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’ అనే చిత్రాన్ని నిర్మించగలిగాను" అని దేవ్ గిల్ చెప్పారు.
"12, 13 ఏళ్ల క్రితం రాజమౌళి గారు నన్ను ముంబై నుంచి పట్టుకొచ్చి నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను హీరోగా సినిమాను తీశాను. నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. నన్ను ఇంత వరకు విలన్‌గా చూశారు. నా మీద ప్రేమను కురిపించారు. కానీ, ఈ సినిమాతో మీ అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోన్నాను" అని హీరో దేవ్ గిల్ తెలిపారు.
"డైరెక్టర్ త్రికోటి గారికి చాలా పెద్ద విజన్ ఉంది. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్ చేస్తాం. మా సినిమా మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించి, ఆదరించాలని కోరుకుంటున్నాను" అని దేవ్ గిల్ చెప్పుకొచ్చారు.
దేవ్‌గిల్ భార్య, నిర్మాత ఆర్తి మాట్లాడుతూ.. "మా కల నెరవేరబోతోంది. ఇదే మాకు మొదటి చిత్రం. మా ప్రొడక్షన్ నుంచి మొదటి చిత్రం రాబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటి వరకు మా మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ వచ్చారు. ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అందరూ మా సినిమాను ఆదరించండి" అని అన్నారు.
"నేను ప్రొడక్షన్ టీంలో పని చేశాను. తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. దేవ్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఓ ఆర్టిస్ట్‌గా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. తెలుగు ప్రజలంతా ఈ సినిమాను ఆధరిస్తారని కోరుకుంటున్నాను" అని యువరాజ్ తెలిపారు.