Love Reddy Review: లవ్ రెడ్డి రివ్యూ.. యూత్‌కు కనెక్ట్ అయ్యే స్వచ్ఛమైన ప్రేమకథ ఎలా ఉందంటే?
Love Reddy Movie Review In Telugu: తెలుగు రొమాంటిక్ మూవీ లవ్ రెడ్డి మూవీ ఇవాళ (అక్టోబర్ 18) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. స్మరన్ రెడ్డి కథ, దర్శకత్వం వహించిన లవ్ రెడ్డి ప్రీమియర్ షోను గురువారం (అక్టోబర్ 17) వేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో లవ్ రెడ్డి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్ : లవ్ రెడ్డి
నటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, ఎన్‌టీ రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులు
రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
నిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్
నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: అక్టోబర్ 18, 2024
Love Reddy Review In Telugu: ఈ మధ్య మంచి కంటెంట్‌తో వస్తున్న సినిమాలకు ప్రేక్షకాదరణ బాగానే లభిస్తోంది. సినిమాకు చిన్నా పెద్ద అనే తేడా చూపించకుండా బాగుంటే వీక్షించేందుకు థియేటర్లలోకి వెళ్తున్నారు నేటి ఆడియెన్స్. మంచి కంటెంట్‌ను ఆదరిస్తారనే నమ్మకంతో నూతన నటీనటులతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు.
అలా తాజాగా తెలుగులో విడుదలైన రొమాంటిక్ మూవీనే లవ్ రెడ్డి. ఈ సినిమాతో టాలీవుడ్‌కు యంగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు స్మరన్ రెడ్డి. ఇప్పటికే విడుదలైన లవ్ రెడ్డి టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. దాంతో లవ్ రెడ్డిపై కాస్తా హైప్ క్రియేట్ అయింది.
హీరో కిరణ్ అబ్బవరం లవ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఇలా ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల వద్దకు చేరిన లవ్ రెడ్డి మూవీ మంచి అంచనాల మధ్య ఇవాళ (అక్టోబర్ 18) రిలీజ్ కానుంది. అయితే, గురువారం (అక్టోబర్ 17) అంటే రిలీజ్‌కు ఒకరోజు ముందే లవ్ రెడ్డి ప్రీమియర్ షో వేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో లవ్ రెడ్డి రివ్యూలో చూద్దాం.
కథ:
30 ఏళ్ల వయసు వచ్చిన నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కు పెళ్లి కాదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసిన రెజెక్ట్ చేస్తుంటాడు. అయితే, ఒకసారి బస్‌లో దివ్య (శ్రావణి రెడ్డి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. తనకు నచ్చిన అమ్మాయి దొరికిందని సంబరపడిపోతాడు. అప్పటి నుంచి లవ్ రెడ్డిగా మారి దివ్యనే లోకంగా జీవిస్తాడు.
ఈ క్రమంలోనే నారాయణ రెడ్డితో దివ్య కూడా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది. ఒకరినొకరు లవ్ మ్యాటర్ చెప్పుకోకుండానే బాగా దగ్గరవుతారు. కానీ, ఓ రోజు దివ్యకు ప్రపోజ్ చేస్తే ఆమె రెజెక్ట్ చేస్తుంది. దాంతో నారాయణ రెడ్డి షాక్ అవుతాడు.
ట్విస్టులు
నారాయణ రెడ్డి ప్రాణంగా ప్రేమించిన దివ్య ఎందుకు లవ్ రెజెక్ట్ చేసింది? దివ్య నిజంగానే నారాయణను లవ్ చేయలేదా? దివ్య వల్ల నారాయణ రెడ్డి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? వీరి లవ్ స్టోరీ క్లైమాక్స్ ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే లవ్ రెడ్డి మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
లవ్ స్టోరీ బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. లవ్ స్టోరీ కామన్‌గా ఉన్న తెరకెక్కించే విధానం బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. అయితే, ‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే’ ఈ కొటేషన్ సినిమా ఎండింగ్‌లో వస్తుంది. ఈ మాటకు తగినట్లుగానే సినిమా అంతా సాగుతుంది.
పరువు, ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు స్మరన్ రెడ్డి. ఎంటర్‌టైనింగ్‌గా స్టోరీని స్టార్ట్ చేసినప్పటికీ క్లైమాక్స్‌కు చేరేవరకు ప్రేక్షకుడి గుండెను బరువెక్కించేశారు. ఒక ఎమోషన్‌తో థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్తారు.
అందులో సక్సెస్
లవ్ కాన్సెప్ట్ సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్నా థియేటర్ నుంచి వెళ్లే ప్రేక్షకుడికి కలిగే అనుభూతి ఎంతో ముఖ్యం. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. తొలి సినిమానే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమా కథనాన్ని నడిపించారు. అలాగే, కొత్త నటీనటుల నుంచి మంచి యాక్టింగ్‌ను రాబట్టగలిగారు.
ఇకపోతే సినిమా పెళ్లి చూపుల సన్నివేశంతో ప్రారంభం అవుతుంది. హీరో లవ్ రెడ్డిగా మారిన తర్వాత కథనం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కానీ, తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు.
ఇంటర్వెల్ ట్విస్ట్
ఇంటర్వెల్ సీన్ మంచి ట్విస్ట్‌లా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది. నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.
క్లైమాక్స్ మాత్రం గుండె బరువెక్కేలా చేస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని చెప్పలేం. గతంలో ఇలాంటి క్లైమాక్స్ చాలా లవ్ స్టోరీ సినిమాలకు ఉంది. కానీ, తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే. ఇక నటీనటుల విషయానికొస్తే.. వారంతా కొత్తవాళ్లే అయినా క్యారెక్టర్స్‌లో సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోగా.. తొలి సినిమాలోనే సహజ నటనతో అలరించాడు.
ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే.. స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చిన లవ్ రెడ్డి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో ఎంచక్కా చూసేయొచ్చు.