Level Cross Review: లెవెల్ క్రాస్ రివ్యూ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగే మలయాళం థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Level Cross Review: సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మలయాళ మూవీ లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అమలాపాల్,ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించారు.
Level Cross Review: ఆసిఫ్ అలీ, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి అర్ఫాజ్ ఆయూబ్ దర్శకత్వం వహించాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లెవెల్ క్రాస్ ఎలా ఉందంటే?
రఘు జీవితంలోకి చైతాలి...
రఘు (ఆసిఫ్ అలీ) ఎడారి దగ్గరలోని ఓ రైల్వై లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. ఓ రోజు రన్నింగ్ ట్రైన్ నుంచి ఓ అమ్మాయి పడిపోతుంది. ఆమెను రఘు రక్షించి తన ఇంటికి తీసుకొస్తాడు. తన పేరు చైతాలి (అమలాపాల్) అని, సెకలాజిస్ట్ గా పనిచేస్తున్నట్లు రఘుతో చెబుతుంది.
తన దగ్గరకు పేషెంట్‌గా వచ్చిన జించో (షరాఫుద్దీన్) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లుగా రఘుకు తన కథ చెబుతుంది చైతాలి. పెళ్లి తర్వాతే జించో సైకో అని, డ్రగ్స్‌కు అలవాటుపడి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి బయటపడిందని అంటుంది. అతడి బారి నుంచి తప్పించుకోవడానికే తాను ట్రైన్ నుంచి దూకానని రఘుకు తాను ఎదుర్కొన్న కష్టాలు వివరిస్తుంది. చైతాలి కథ విని కరిగిపోయిన రఘు ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. త
నకు పెళ్లికాలేదని, తల్లి చనిపోవడంతో ఒంటరిగాబతుకుతున్నానని చైతాలితో తన గురించి చెబుతాడు రఘు. ఇంట్లో దొరికిన ఐడీ కార్డ్‌తో పాటు కొన్ని పేపర్స్ ఆధారంగా అసలు అతడు రఘు కాదని, రఘు స్థానంలో మారుపేరుతో గేట్‌మెన్ జాబ్ చేస్తున్నాడనే చైతాలికి తెలిసిపోతుంది. నలుగురిని చంపిన సైకో కిల్లర్ అనే నిజం బయటపడుతుంది.
అదే టైమ్‌లో చైతాలిని వెతుక్కుంటూ రఘు దగ్గరకు ఆమె భర్త జించో వస్తాడు. చైతాలి అసలు పేరు శిఖా అని, స్క్రిజోఫెన్షియా అనే వ్యాధితో బాధపడుతున్న ఆమె ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయివచ్చిందని అంటాడు. శిఖాకు తానే పర్సనల్‌గా ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు రఘుతో చెబుతాడు జించో.
రఘు గతం ఏమిటి? మారుపేరుతో ఎందుకు బతుకుతున్నాడు? తన భర్త గురించి చైతాలి చెప్పిన కథ నిజమేనా? జించో నిజంగా డాక్టరేనా? జించో చెప్పిన శిఖా స్క్రిజోఫెన్షియా బాధ్యతో బాధపడుతుందా? చైతాలి కోసం జించోను చంపాలని రఘు ఎందుకు అనుకున్నాడు? చివరకు ఏమైంది? అన్నదే ఈ మూవీ కథ.
మూడు పాత్రలు..
మూడు పాత్రల నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రతి మనిషి జీవితంలో తెలియని కోణం ఉంటుంది. గతం తన వర్తమానంతో పాటు భవిష్యత్ జీవితానికి ప్రమాదకరంగా పరిణమించినప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? నిజానికి, అబద్ధానికి మధ్య ఓ ముగ్గురి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందిఅన్నదే లెవెల్ క్రాస్ మూవీలో చూపించాడు దర్శకుడు అర్ఫాజ్ ఆయూబ్.
ఎవరు నిజం చెప్పారు?
ఈ ముగ్గురిలో తమ గురించి ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం ఆడుతున్నారన్నది చివరి వరకు రివీల్ కాకుండా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు దర్శకుడు. ఒక్కొక్కరి గతం గురించి వెల్లడయ్యే ట్విస్ట్‌లు మైండ్‌బ్లోయింగ్‌గా అనిపిస్తాయి.
డిఫరెంట్ క్లైమాక్స్...
గేట్‌మెన్‌గా రఘు పాత్ర పరిచయంతోనే ఈ కథ మొదలవుతుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకినచైతాలిని రఘు సేవ్ చేసే సీన్స్‌తో నెమ్మదిగా కథలోకి వెళ్లాడు డైరెక్టర్. చైతాలి తన గతం గురించి రఘుకు చెప్పే ఎపిసోడ్ సుదీర్ఘంగా సాగుతుంది. స్లోగా సాగిపోతున్న కథలో రఘు ఓ సైకో కిల్లర్ అంటూ నిజం వెల్లడయ్యే మలుపు బాగుంది.
మళ్లీ అతడికో ఫ్లాష్‌బ్యాక్ తర్వాత...అంత ఒకే అనుకునే టైమ్‌లో జించో ఎంట్రీ ఇచ్చి చైతాలి గురించి అతడో షాకింగ్ నిజం బయటపెడతాడు. క్లైమాక్స్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకదాని వెంట మరొకటి వరకు ట్విస్ట్‌లు వచ్చిపడుతూనే ఉంటాయి. కథ మొత్తం ఎడారిలాంటి ప్రదేశంలో ఒకే ఇంట్లో సాగుతుంది. లొకేషన్ ఈ సినిమా బిగ్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ఆర్ట్ ఫిల్మ్ తరహాలో...
లెవెల్ క్రాస్ పాయింట్, యాక్టింగ్ పరంగా బాగున్నా... ఆర్ట్ ఫిల్మ్ మాదిరిగా సాగడం మైనస్ అయ్యింది. నాలుగైదు ట్విస్ట్‌లు మినహా మిగిలిన స్టోరీ మొత్తం డైలీ సీరియల్‌లను తలపిస్తుంది. పాట ఒక్కటే అయినా అది అనవసరంగా కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
డీ గ్లామర్ పాత్రలో...
రఘు పాత్రలో ఆసిఫ్ అలీ అదరగొట్టాడు. డీ గ్లామర్ లుక్‌లో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్స్‌లో అతడి నటన బాగుంది. చైతాలిగా అమలాపాల్ యాక్టింగ్ కాస్త కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. పూర్తిగా పాత్రను ఓన్ చేసుకోలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది. జించో పాత్రలో షరాఫుద్దీన్ నటన ఓకే అనిపిస్తుంది.
ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను లెవెల్ క్రాస్ మెప్పిస్తుంది. ఆసిఫ్ అలీ, అమలాపాల్ యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.