Jeethu Joseph: మలయాళంలో వెబ్‌సిరీస్ చేస్తోన్న దృశ్యం డైరెక్టర్ - మీనా లీడ్ రోల్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Jeethu Joseph: దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోన్నాడు. రోస్లిన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Jeethu Joseph: దృశ్యం కాంబో మరోసారి అభిమానుల ముందుకు రాబోతోంది. సీనియర్ హీరోయిన్ మీనాతో దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్‌గా కనిపించింది. తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. దృశ్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్‌తో పాటు తెలుగు రీమేక్‌లోనూ మీనానే లీడ్ రోల్‌లో కనిపించింది.
షో రన్నర్‌గా...
తాజాగా జీతూ జోసెఫ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. అయితే ఈ సిరీస్‌కు జీతూ జోసెఫ్ డైరెక్టర్‌గా కాకుండా షో రన్నర్‌గా, ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు రోస్లిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వినాయక్ శశికుమార్ కథను అందిస్తున్నారు. ఇందులో మీనాతో పాటు ప్రేమదేశం ఫేమ్ వినీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంజనా దీపు, హకీమ్ షా కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
సీక్రెట్ స్టోరీస్...
జీతూ జోసెఫ్ సినిమాల తరహాలోనే ఊహలకు అందని ట్విస్ట్‌లు టర్న్‌లతో రోస్లిన్ వెబ్‌సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ టైటిల్‌కు సీక్రెట్ స్టోరీస్ అనే క్యాప్షన్ పెట్టారు. ఇటీవల ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ కన్నుపై అమ్మాయి నిల్చొని ఉన్నట్లుగా పోస్టర్‌ను వెరైటీగా డిజైన్ చేశారు. పోస్టర్‌లో ఓ పాతకాలం నాటి బిల్డింగ్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో...
రోస్లిన్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ మలయాళం వెబ్‌సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్నట్లు సమాచారం. జూన్ లేదా జూలై నుంచి హాట్‌స్టార్‌లో రోస్లిన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
సలార్‌కు పోటీగా...
నేరు మూవీతో గత ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు జీతూ జోసెఫ్. సలార్‌కు పోటీగా రిలీజైన ఈ మలయాళం మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో మోహన్‌లాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన నేరు...81 కోట్ల వసూళ్లను రాబట్టింది. గత ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో మూవీగా నిలిచింది. అంతే కాకుండా మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న ఐదో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు కొరియన్, ఇండోనేషియన్ భాషల్లో రీమేకైంది. తాజాగా హాలీవుడ్‌లో ఈ మూవీ రీమేక్ కాబోతోంది.
ఐదో సారి....
ప్రస్తుతం మోహన్‌లాల్‌తోనే రామ్ అనే మూవీ చేస్తోన్నాడు జీతూ జోసెఫ్. వీరిద్దరి కాంబోలో రాబోతోన్న ఐదో మూవీ ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మోహన్ లాల్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. రామ్ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.